‘యాసంగి’ ప్రణాళిక ఖరారు
ప్రణాళిక ఖరారైంది
సబ్సిడీపై విత్తనాలు అందించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్‌కు గాను జిల్లాలో సాగు చేసే పంటల ప్రణాళిక ఖరారైంది. ఇందులో వరి పంటే ప్రధానంగా మారనుంది. మొక్కజొన్న, నువ్వు, వేరుశెనగ పంటల విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి దాదాపు 3.95 లక్షల ఎకరాల్లో సాగు కానున్నాయి. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా ఉండటంతో సాగునీటికి ఇబ్బంది లేకుండాపోయింది. మరోవైపు ఎస్సారె స్పీ నీరు కూడా తోడుకానున్నాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. బావులు, బోర్లలో మూడు నుంచి నాలుగు మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి. మొత్తంగా వరిని 3.02 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 35వేలు, నువ్వు 11వేలు, ఆయిల్ పాం 4,200, వేరుశనగ 320, పెసర 50, మినుము 150, ఆవాలు 190, చెరుకు 190, సజ్జ 2,300 ఎకరాల చొప్పున సాగు చేయనున్నారు. ఉద్యాన పంటలైన కూరగాయలను 250 ఎకరాలు, మామిడి 38,300, ఇతర పండ్లతోటలు 210, మిరప 750 ఎకరాల్లో సాగు చేయనున్నారు. వేరుశనగకు కోతులు, అడవి పందుల బెడదతో విస్తీర్ణం భారీగా పడిపోయింది. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ మూత పడటంతో గతంలో 60వేల నుంచి 70వేల ఎకరాలు సాగు చేయగా.. ప్రస్తుతం 190 ఎకరాలకు పడిపోయింది.
ఎరువులు సిద్ధం
యాసంగి సీజన్‌కు అవసరమైన రసాయన ఎరువులను సిద్ధం చేస్తున్నారు. పంటల అవసరం మేరకు దఫదఫాలుగా రసాయన ఎరువులను మార్క్‌ఫెడ్ గోదాంల్లో అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాకు యూరియా 49,948 టన్నులు, డీఏపీ 16,899, పొటాష్ 8,330, సింగిల్ సూపర్ పాస్పేట్ 3664, కాంప్లెక్స్ ఎరువులు 37,844 టన్నులు అందుబాటులో ఉంచనున్నారు.
విత్తనాలు ప్రైవేట్ కంపెనీలవే..
పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ.. నాణ్యమైన విత్తనాలు మాత్రం సరిగ్గా దొరకడం లేదు. పంట ఏదైనా ప్రతి విత్తనానికి ప్రైవేట్ కంపెనీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కంపెనీలు చెప్పిన రేటుకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాకు వరి విత్తనాలు 75,650 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,800 క్వింటాళ్లు, నువ్వులు 385 క్వింటాళ్లు, సజ్జలు 35 క్వింటాళ్లు, వేరుశనగ 128 క్వింటాళ్లు అవసరమవుతాయి. రైతులు స్వయంగా విత్తనాలు తయారు చేసుకోవడం పూర్తిగా మర్చిపోయారు. 30 కిలోల వరి విత్తనాలను ఆయా కంపెనీలు రూ.800 నుంచి రూ.1200 వరకు పెంచాయి. అయినప్పటికీ రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మొక్కజొన్న విత్తనాలను ప్రైవేట్ కంపెనీలు 4 కిలోల బ్యాగ్‌కే రూ.1200 నుంచి రూ.1400 వరకు వసూలు చేస్తున్నాయి. వేరుశనగ విత్తనాలను కొద్ది మొత్తంలో సరఫరా చేసినప్పటికీ.. రైతులకు తెలియక ముందే అయిపోయాయి.
జిల్లాలో సాగయ్యే పంటల వివరాలతో నివేదిక తయారు చేశాం. ఇప్పటికే నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపించాం. రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడే బదులు బృందాలుగా ఏర్పడి విత్తనాలను ఉత్పత్తి చేసుకుంటే మేలు.
– వడ్డేపల్లి భాస్కర్, డీఏవో
యాసంగిలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో అన్ని పంటల సాగు పెరుగుతుంది. రైతులకు ప్రతి పంట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించాలి. ప్రైవేట్ కంపెనీలు చెప్పిన ధరకు విత్తనాలు కొంటే అధిక ఖర్చు అవుతుంది. – నక్కల తిరుపతి రెడ్డి,
రైతు సంఘం నాయకుడు, తొంబర్రావుపేట
‘యాసంగి’ ప్రణాళిక ఖరారు
‘యాసంగి’ ప్రణాళిక ఖరారు


