ఇంధన వినియోగంలో గోల్‌మాల్..?
రాయికల్: రాయికల్ బల్దియాలో చెత్త సేకరణకు వినియోగించే ఆటోలు, ట్రాక్టర్లకు నెలకు రూ.1.82లక్షల ఖర్చవుతోంది. ఇంత చిన్న మున్సిపాలిటీలో అంతమొత్తం వెచ్చిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు రికార్డులు రాస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలో 12 వార్డులు ఉన్నాయి. సుమారు 3,500 వరకు గృహాలున్నాయి. ఇందులో చెత్త సేకరణ కోసం ప్రతిరోజు నాలుగు మినీ ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నారు. గతంలో ఆరు మినీ ఆటోలు కొనుగోలు చేయగా.. రెండు మరమ్మతుల కారణంగా మూలకు పడేశారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రెండు ట్రాక్టర్లు ఉండగా.. ఇందులో చెత్త సేకరిస్తోంది. మరొకటి ఫ్రంట్‌బ్లేడ్ వాహనం. 12 వార్డుల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పారిశుధ్య సిబ్బంది వచ్చి చెత్త సేకరిస్తున్నారు.
అక్షరాల రూ.1.82 లక్షలు
పట్టణ విస్తీర్ణం 12 కిలోమీటర్లు ఉంటుంది. చెత్త సేకరించే ట్రాక్టర్ ప్రతిరోజూ సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే తిరుగుతుంది. ఈ లెక్కన ఈ ట్రాక్టర్‌కు ప్రతిరోజూ రెండు లీటర్లు ఇంధనం ఖర్చవుతుందని అనుకున్నా.. నెలకు కేవలం 60 లీటర్లు. ఇక నాలుగు ఆటోలు కలిపి ప్రతిరోజూ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక్కో ఆటోకు రోజుకు రెండు లీటర్ల పెట్రోల్ వినియోగం అవుతుందని అనుకున్నా.. 240 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. దీని ప్రకారం ఎలా లెక్కించినా ఖర్చు రూ.50వేలు కూడా దాటదు. కానీ.. అధికారులు మాత్రం ఏకంగా రూ.1.82లక్షలు వెచ్చిస్తున్నట్లు రికార్డులు రాస్తుండడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆటోలు డీజిల్‌తో నడుస్తుండగా.. ఇక్కడ మాత్రం పెట్రోల్ వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం సుమారు రూ.రెండు లక్షల వరకు వ్యయం కావడంపై పట్టణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చెత్త సేకరణ కోసం 57 మంది పారిశుధ్య సిబ్బంది ఉంటే ప్రస్తుతం 26 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో మహిళా సిబ్బంది కేవలం ఊడ్వడం, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పరిమితం అవుతున్నారు. పురుషులు ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నారు. నెల రోజులుగా ఆటోలు రిపేరులో ఉన్నా కూడా రూ.1.82లక్షల పెట్రోల్, డీజిల్ వ్యయం ఎలా అయ్యిదంటూ పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రిపేరులో ఉన్న ఆటోలను వినియోగించి పారదర్శకంగా పెట్రోల్, డీజిల్ ఖర్చులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.


