ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎనిమిది గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 34,654 క్యూసెక్కులు వస్తోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా ఆరువేలు, సరస్వతి కెనాల్‌కు 650, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. కాకతీయకాలువకు సాయంత్రం నీటి విడుదల నిలిపివేశారు.
ఆయిల్ పాం సాగుపై అవగాహన
జగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం సాగుపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పొలాస రైతువేదిక ఆవరణలో మంగళవారం అవగాహన కల్పించారు. వ్యవసాయ, ఉద్యానవన, సహకార సంఘాల సీఈవోలు హాజరయ్యారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కొనసాగుతుందని, 90శాతం సబ్సిడీ ఉందని, వివరాలన్నీ రైతులకు వివరించాలని సూచించారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన 3,750 ఎకరాల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఆయిల్ పాం సాగు విధానం, దిగుబడిపై శాస్త్రవేత్త ఎండీ.ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి స్వాతి వివరించారు.
జిల్లాకు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీలక్ష్మీ తెలిపారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. 30, 31 తేదీల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత


