రైతులూ జాగ్రత్తగా ఉండండి
జగిత్యాల: జిల్లాపై మోంథా
ముప్పు కొంత మేర ఉంటుందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రస్తుతం ఆంధ్రాలో తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, జిల్లాపైనా కొంత ప్రభావం చూపనున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మోంథా తుపాన్ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో
మాట్లాడారు.
మోంథా ముప్పు జిల్లాలో ఏమైనా ప్రభావం చూపుతుందా. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మోంథా ముప్పు మన జిల్లాలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ రైతులు జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా చూసుకోవాలి. సెంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.
రైతులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
రైతులు ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా జిల్లావ్యాప్తంగా 408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనేలా చూస్తున్నాం. రైతులు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలి. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రానికి 40 టార్పాలిన్ల చొప్పున సమకూర్చాం.
ఇప్పటివరకు ఎన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు..?
సుమారు 200కు పైగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎప్పటికప్పుడు తేమశాతాన్ని పరిశీలిస్తున్నారు. నిబంధనల మేరకు తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు రెండురోజులపాటు కోతలు వాయిదా వేసుకోవడం మంచిది. గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ ర కానికి రూ.2,369 మద్దతుగా ధరగా నిర్ణయించాం.
ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు..?
సుమారు 5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎంత దిగుబడి వచ్చినా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే వర్షప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్త పడాలి. స్టేట్ లెవల్‌లో టోల్‌ఫ్రీ నంబరు కూడా ఉంది. మార్కెట్‌కు చేరిన పంట తడవకుండా అవసరమైన మేర టార్పాలిన్ కవర్లు సిద్ధం చేశాం.


