
శిశుమరణాలను నివారించాలి
జగిత్యాల: శిశుమరణాలను నివారించేలా చూడాలని, ఆస్పత్రికి వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో చైల్డ్‌డెత్‌పై సమీక్ష నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 10 మంది చిన్నపిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఎక్కువగా ప్రీ టర్మ్ బేబీస్ కన్జెంటల్ హార్ట్ డిసిజేస్, ఆస్పిరేషన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎంసీహెచ్‌లో వెంటిలేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత బుజంపై వేసుకుని బర్ఫింగ్ వేయాలని, నెమ్మదిగా వెన్నుపై తట్టాలన్నారు. ఆశా కార్యకర్తలు బాలింతలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చైల్డ్ డెత్ రివ్యూ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, మాత శిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
1న కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు
జగిత్యాలఅగ్రికల్చర్: నవంబర్ 1న కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా సహకారాధికారి సీహెచ్.మనోజ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు కరీంనగర్, జగిత్యాలలో శాఖలు ఉన్నాయి. ఆక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు, 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియ కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో నిర్వహించడం జరుగుతుందన్నారు. కరీంనగర్ ఓటర్ల కోసం కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల ఓటర్ల కోసం జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఉంటుందన్నారు.