
ఎగ్ బిర్యానీ పెడ్తలేరు
పెగడపల్లి: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం అంగన్‌వాడీ కేంద్రాల ఉద్దేశం. జిల్లా ఐసీడీఎస్ పరిధిలో నాలుగు ప్రాజెక్టుల్లో 7,267 మంది గర్భిణులు, 4,553 మంది బాలింతలు, 4,518 మంది ఆర్నెళ్లలోపు చిన్నారులు, 32,437 మంది ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల, 33,012 మంది మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం అందించేందుకు కొద్దిరోజుల క్రితం అంగన్‌వాడీల్లో ఎగ్‌బిర్యానీ పథకాన్ని ప్రారంభించారు. తొలిరోజు ఊరించి.. తరువాత ఉసూరుమని పించారు. దీంతో జిల్లాలోని అంగన్‌వాడీకేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పథకం అటకెక్కింది. నిధుల లేమితో ఒక్కరోజుతోనే నిలిచిపోయింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లు, పాలు, బాలా మృతం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మ రింత పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో అమ్మమాట.. అంగన్‌వాడీ బడిబాట, ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చిన్నారులను కేంద్రాలను రప్పించడం లక్ష్యంగా ఈ ఏడాది జూన్ 11న జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ త యారు చేసి, కేంద్రాలకు వచ్చిన చిన్నారులు, బా లింతలు, గర్భిణులకు అందించారు. వారంలో రెండుసార్లు అందించాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు సైతం ఉత్సాహం చూపించారు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడం, నిధుల మంజూరు చేయకపోవడంతో ఎగ్ బిర్యానీ ఒక్క రోజుకే పరిమిౖతమైంది. పథకం కొనసాగించేలా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ ప్రారంభించాం. తరువాత ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం’. అని డీడబ్ల్యూవో నరేశ్ వివరించారు.