
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
● మరో బాలుడికి తీవ్రగాయాలు ● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ వైద్య సిబ్బందిపై దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో.. జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పాటి శశికుమార్ (16), మోతె తరుణ్ ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వస్తున్నారు. తాటిపల్లి శివారులో వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం వీరిని ఢీకొంది. ఈ ఘటనలో బైక్ అదుపుతప్పి శశికుమార్, తరుణ్ కింద పడ్డారు. వారిని స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శశికుమార్ మృతిచెందాడు. శశికుమార్ మృతికి వైద్యులు, వైద్య సిబ్బంది కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోగుల బంధువులతో మాట్లాడారు. పట్టణ సీఐ కరుణాకర్‌ను వివరణ కోరగా.. గొడవ నిజమేనని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
రాయికల్: మండలంలోని అల్లీపూర్ బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో సింగర్రావుపేటకు చెందిన జైనొద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రెవెన్యూ సిబ్బందిపై దాడి..?
కోరుట్ల: లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకున్నందుకు మంగళవారం రాత్రి ఓ వ్యక్తి రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కోరుట్ల మండలం నాగులపేట సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తీసుకెళుతున్న లారీని నలుగురు రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి శ్రీడబ్బులు తీసుకుంటున్నారు.. మళ్లీ ట్రాక్టర్లు పట్టుకుంటున్నారు..శ్రీ అని ఆరోపిస్తూ గొడవకు దిగినట్లు ఓ కిందిస్థాయి ఉద్యోగిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. నలుగురు రెవెన్యూ సిబ్బంది సదరు వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వీరిలో ఓ కిందిస్థాయి ఉద్యోగికి ఇసుక అక్రమ రవాణాదారులతో ఉన్న సంబంధాల ఫలితంగానే అక్రమార్కులు రెచ్చిపోతున్నట్లు సమాచారం. టిప్పర్‌ను అడ్డుకున్న వారిలో సదరు ఉద్యోగి ఉన్నట్లు తెలిసింది. ఈ గొడవ జరిగిన వెంటనే రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఆర్టీసీ డిపోలో ఉంచినట్లు తెలిసింది. నలుగురు రెవెన్యూ సిబ్బందిలో ఇద్దరు వారసత్వంగా పనిచేస్తున్న వారు కావడంతో పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయాలన్న విషయంలో మీమాంస నెలకొన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు దాడి జరిగిన ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై చిరంజీవి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి