
బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం
మాక్లూర్/నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటుకు ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ (25)తో పది నెలల క్రితమే వివాహమైంది. బీటెక్ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై తమను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి రావాలని చింటు తండ్రి నారాయణ (58)ను కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. చింటు డ్రైవింగ్ చేస్తున్నారు. దుర్గానగర్ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పూజ, చింటును ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. మామ, కోడలు మృతితో తల్వేదలో విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
నారాయణ (ఫైల్)
పూజ (ఫైల్)
స్వల్పగాయాలతో బయటపడిన మృతురాలి భర్త
పైళ్లెన 10 నెలలకే విషాదం
మృతురాలిది ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్

బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం