
మనవద్దా ‘సృష్టి’ కేంద్రాలు..!
● నిబంధనలు పాటించని సంతాన సాఫల్య కేంద్రాలు ● జిల్లావ్యాప్తంగా సుమారు పది వరకు నిర్వహణ ● లోపించిన అధికారుల పర్యవేక్షణ ● తాజాగా తనిఖీలకు ప్రత్యేక బృందాలు
జిల్లాలో ప్రభుత్వ అనుమతితో నాలుగు ఫెర్టిలిటీ కేంద్రాలు నడుస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా అనధికారికంగా పది వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు నేరుగానే ఫెర్టిలిటీ సెంటర్‌గా పేరు పెట్టుకుని చికిత్స చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
పేదలే టార్గెట్
కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు ఆర్థికంగా లేని మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి ఎంతోకొంత ముట్టజెప్పి వారి అండాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని కేంద్రాలు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళల వద్దకు కొందరు నిర్వాహకులు వెళ్లి వారిని ఫెర్టిలిటీ సెంటర్లకు తీసుకొచ్చి అండాలు విక్రయించుకునేలా చేస్తున్నట్లు తెలిసింది.
అమ్మ కోసమే..
చాలామంది దంపతులకు కొన్ని కారణాలతో సంతానం కలగకపోవడంతో ఈ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మధ్యవర్తులు ఆశ్రయిస్తున్నారు. వారు ఇదే అదునుగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఫెర్టిలిటీ కేంద్రాలు నియమించుకున్న పీఆర్వోలతో ఈ దందా నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. చికిత్స కోసం వచ్చిన దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్లలో రెండు రకాల చికిత్సలు చేస్తారు. దంపతులను పరీక్షించి వారిలో ఉన్న లోపం గుర్తించి వీర్యకణాలు, అండాలు సేకరించి చికిత్స చేస్తుంటారు. ఇందులో ఒకటి ఇంట్రాయుటిరైన్ ఇన్ సెమినేషన్ (ఐయూఐ), రెండోది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇది దంపతుల అంగీకారంతోనే చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతర దాతల నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ప్రవేశపెట్టి సంతానం కలిగేలా చికిత్స చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని ఇప్పటికే వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో అనుమతి ఉన్న కేంద్రాలు ఎన్ని..? లేనివి ఎన్ని..? నిబంధనల ప్రకారం ఉన్నాయా..? లేవా..? పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.
జగిత్యాల: ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన సంతాన సాఫల్య కేంద్రాలు.. ప్రస్తుతం జిల్లాలకూ విస్తరించాయి. ఒకటికాదు.. రెండుకాదు.. విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండానే ప్రతిచోట ఫెర్టిలిటీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సికింద్రాబాద్‌లో సృష్టి సరోగసి కేంద్రంలో జరిగిన మోసంతో జిల్లాలోని ఫెర్టిలిటీ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కలెక్టర్ సత్యప్రసాద్ కూడా ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా.. జిల్లాలోనూ బృందాలను నియమిస్తున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫెర్టిలిటీ సెంటర్‌లో అన్ని వసతులు కల్పించడంతోపాటు డీఎంఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

మనవద్దా ‘సృష్టి’ కేంద్రాలు..!