
వసతుల్లేని గోదావరి
ధర్మపురి: గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. ఫలితంగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్నానాలకోసం వచ్చే భక్తులకు గోదావరిలో నీడ సౌకర్యం కల్పించడంతోపాటు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు తప్పనిసరి. కానీ.. వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. భక్తుల ద్వారా నృసింహస్వామి ఆలయం, మున్సిపాలిటీకి ప్రతిరోజూ భారీగానే ఆదాయం సమకూరుతోంది. కానీ.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మాత్రం అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అంటున్నారు. ఏ పుణ్యక్షేత్రంలో చూసినా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ ధర్మపురి పుణ్యక్షేత్రంలో మాత్రం భక్తులు వసతులకు నోచుకోలేకపోతున్నారు.
శ్రావణంలో భక్తుల రద్దీ
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి వద్ద గోదావరితోపాటు, శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు గోదావరి, దేవాలయాలు కిక్కిరిసి పోతాయి. పుణ్యస్నానాలు, దైవదర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం లక్ష్మీనృసింహస్వాములను దర్శించుకుంటారు.
కనిపించని వసతులు
శ్రావణమాసం సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. గోదావరిలో స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకుంటారు. అలాంటి వసతులు గోదావరిలో ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు బట్టలు మార్చుకునేందుకు రాళ్లు రప్పలు, ముళ్ల పొదలను ఆశ్రయించాల్సి వస్తోంది.
నిరుపయోగంగా షెడ్లు
గోదావరిలో కనీసం తాత్కాలిక షెడ్లనైనా ఏర్పాటు చేయాలని భక్తులు అంటున్నారు. కొందరు స్నానాల కోసం నది దాటి వెళ్తున్నారు. అక్కడ వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మంగలిగడ్డ వద్ద గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద 2, 3 షెడ్లు మాత్రమే ఉన్నాయి. వాటి పైకప్పులు గాలికి లేచిపోవడంతో నామమాత్రంగా కవర్ కప్పారు. అయితే ఆ పుష్కరఘాటు వద్ద నీరు లేకపోవడంతో భక్తులు స్నానాల కోసం ఎగువ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలితంగా ఆ షెడ్లు నిరుపయోగంగా మారాయి. భక్తులున్న చోట వసతులు కల్పిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.
పుణ్యస్నానాలకు భక్తుల ఇబ్బందులు
పుష్కరఘాట్ల వద్ద నామమాత్రంగా ఏర్పాట్లు
ఆదాయమున్నా.. వసతుల కల్పనలో నిర్లక్ష్యం

వసతుల్లేని గోదావరి