
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం
● పీఎంశ్రీ స్కూళ్లకు చేరిన వాయిద్య పరికరాలు ● వారానికో తరగతి చొప్పున నిర్వహణ ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● జిల్లాలో పది పాఠశాలల ఎంపిక
గొల్లపల్లి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, వారి సర్వతోముఖాభివృద్ధికి వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్ఛికంగా నేర్చుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లాలో పది పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను స్కూళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వారంలో ఒకరోజు సంగీతం నేర్చుకోనున్నారు. తద్వారా వారికి శ్రవనానందంతోపాటు, ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్‌ఫోన్లకు దూ రంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఆయా వృత్తుల్లో కూడా స్థిరపడేందుకు ఉపకరిస్తుంది.
శిక్షకులు వస్తే ప్రయోజనం
పాఠశాలలకు సంగీత వాయిద్యాలు అంది నెల రోజులు అవుతోంది. విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసిన వారు అరుదుగా ఉంటారు. ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీ ణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే. అన్ని తెలిసిన వారికి రూ.10 వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. భిన్నరంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పా ఠాలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాఠాలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది.
పరికరాల పంపిణీ
జిల్లాలో పీఎంశ్రీ కింద 10 పాఠశాలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబల, హ ర్మోనియమం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6–10వ తరగతి చదివే విద్యార్థులతోపాటు, కేజీబీవీ, గురుకుల, మోడల్‌స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు నేర్పించనున్నారు.