
‘వరద’ పారదు.. చెరువులు నిండవు
కథలాపూర్: తలాపున గోదావరి ఉన్నా పంటలకు నీరులేక ఇబ్బంది పడుతున్నారు ఎస్సారెస్పీ వరదకాలువ సమీపంలో ఉన్న గ్రామాల రైతులు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్‌తో వరదకాలువకు జలకళ వస్తుంది. కాలువకున్న తూములతో దిగువనున్న గ్రామాల చెరువులకు నీళ్లు చేరుతాయి. కానీ వరదకాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు మాత్రం చుక్కనీరు చేరని పరిస్థితి. వరదకాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని కథలాపూర్ మండల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరదకాలువ ప్రవహించే గ్రామాలివే..
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. సుమారు 84 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఎస్సారెస్పీ వరదకాలువ పెగ్గెర్ల, కథలాపూర్, దుంపేట, దూలూర్, తక్కళ్లపెల్లి వెళ్తుంది. వరదకాలువ నుంచి ఆయా గ్రామాల చెరువులను నింపేందుకు ఇప్పటికే తూములను అధికారులు నిర్మించారు. ఈ తూములు వరదకాలువకు దిగువ భాగాన ఉండటంతో కొన్ని గ్రామాల చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. ఈ క్రమంలో ఎగువన ఉన్న గ్రామాల చెరువులకు నీళ్లు చేరకపోవడంతో ఎత్తిపోతల ద్వారానే నీళ్లందిస్తామని అధికారులు సర్వే చేసి నెలలు గడుస్తున్నా పనులకు మోక్షం కలగలేదు. ఈ వానకాలం సీజన్‌లో పంటలకు నీళ్లందడం కష్టమేనని రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతలతో నీళ్లు నింపే చెరువులు
వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులను నింపేందుకు అధికారులు అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. చింతకుంట లక్కాకుల చెరువు, భూషణరావుపేట తుమ్మల చెరువు, బొమ్మెన తుమ్మల చెరువు, బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊర చెరువు, గంభీర్‌పూర్ తాళ్ల చెరువు, కలిగోట సూరమ్మ చెరువును వరదకాలువ ఎత్తిపోతలతో నింపితే మండలంలోని అన్ని గ్రామాలకు సాగు నీరు అంది భూగర్భజలాలు పెరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువనున్న గ్రామాల చెరువులను నింపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ వరదకాలువ విభాగం ఏఈ పృథ్వీరాజ్ మాట్లాడుతూ... వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులు నింపే పనులకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు.
వరదకాలువ నీటి కోసం ఎదురుచూపు
పంటల సాగుపై అన్నదాతల అయోమయం
జాప్యం సరికాదు
మా భూములకు తుమ్మల చెరువు, రాళ్లవాగు ప్రాజెక్టు ప్రధానం. వర్షం కురిస్తేనే తుమ్మల చెరువు నిండుతుంది. ఊరికి కొద్దిదూరంలోనే వరదకాలువ ఉంది. ఈ సీజన్‌లో వర్షాలు సరిగా కురవడం లేదు. వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులు నింపితే రైతులకు మేలు జరిగేది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులు నింపాలి.
– గడ్డం రాజారెడ్డి, రైతు, భూషణరావుపేట
తాండ్య్రాల చెరువు నింపాలి
తాండ్య్రాల ఊర చెరువులో నీళ్లుంటే ఐదు గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయి. పంటలకు భరోసాగా ఉంటుంది. ఈ వర్షకాలం వర్షాలు సరిగా కురవడం లేదు. చెరువులో నీళ్లు అడుగంటాయి. ఎత్తిపోతల పనులు చేపట్టాలి. వరదకాలువ ఎగువన ఉన్న గ్రామాల చెరువులు నింపేందుకు ప్రత్యేక దృష్టిసారించాలి.
– బాల్క సంజీవ్, రైతు, తాండ్య్రాల

‘వరద’ పారదు.. చెరువులు నిండవు

‘వరద’ పారదు.. చెరువులు నిండవు

‘వరద’ పారదు.. చెరువులు నిండవు