
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జగిత్యాల: గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరిజన తండా, హాస్టళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తండాలు, హాస్టళ్లలో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, హాస్టళ్లలో తాగునీరు, డ్రైనేజీ, సీసీరోడ్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్, సంపత్ పాల్గొన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వారితో ఎస్పీ మాట్లాడారు. వారి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ధర్మపురిలో షాపింగ్ కాంప్లెక్స్ గదులకు వేలం
ధర్మపురి: ధర్మపురిలోని మార్కెట్‌రోడ్‌లో నిర్మించిన కాసుగంటి నారాయణరావు (కేఎన్‌ఆర్) షాపింగ్ కాంప్లెక్స్ గదులకు సీల్డు టెండర్లు, బహిరంగ వేలం వేయనున్నట్లు శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. కాంప్లెక్స్‌లోని గదులకు వచ్చేనెల ఒకటి నుంచి 2028 ఆగస్టు 31వరకు మూడేళ్ల కాల పరిమితితో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 5 నుంచి 18 వరకు ఆన్‌లైన్ టెండర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీల్డు టెండర్ దాఖలు చేయువారు ఈనెల 6 నుంచి 18 వరకు షెడ్యూల్ పొంది 19న ఆలయ కార్యాలయంలోని సీల్డు టెండర్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 19న ఈఎండీ సెక్యూరిటీ డిపాజిట్, ప్రవేశ రుసుం డీడీలు చెల్లించి పాల్గొనాలని కోరారు.
అథ్లెటిక్స్‌లో
క్రీడాకారుల ప్రతిభ
జగిత్యాల: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకేంద్రానికి విద్యార్థులు ప్రతిభ కనబర్చి రెండు బంగారు, కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగిన జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 బాలికల విభాగంలో జష్ణవి బంగారు పతకం, పురుషుల విభాగంలో రాజు 400 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం, అండర్–20 బాలికల విభాగంలో రష్మిక కాంస్య పతకం సాధించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముత్తయ్యరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అంజయ్య, కోశాధికారి కొమురయ్య అభినందించారు.
పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం అయిలాపూర్ పీఏసీఎస్‌లో సోమవారం పోలీసు బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చింది. అప్పటికే రైతులు బారులు తీరడంతో ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి సిఫారసు మేరకు ఎకరానికి ఒక యూరియా బస్తా చొప్పున రైతులకు అందించినట్లు సింగిల్‌విండో చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి తెలిపారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి