
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వండి
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఇటీవల కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పెద్ద ఎత్తున ప్రజావాణికి తరలివచ్చారు. వారితోపాటు జీవన్‌రెడ్డి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంతోపాటు ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి ఇందిరమ్మ కాలనీ నిర్మించిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ 80 గజాల స్థలానికి ప ట్టాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. పేదలు ఇళ్ల పనులను కొద్దికొద్దిగా పూర్తి చేసుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రెండువేల ఇళ్లను కూల్చి 4,520 డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించిందని, 1611 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా వాటి నిర్మాణానికి రూ.52కోట్లు అవసరం అవుతాయని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించా మని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల పేరిట వివిధ దశల్లో ఉన్న వందకు పైగా ఇందిరమ్మ ఇళ్లను బల్దియా అధికారులు కూల్చివేశారని తెలి పారు. ఇలా ఇళ్లు కోల్పోయిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలన్నారు. ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, చంద రాదాకిషన్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, లైశెట్టి విజయ్ ఉన్నారు.