
చిరుజల్లులకే పరిమితమైన వర్షాలు
● జిల్లాలోని 20 మండలాల్లో లోటు వర్షాపాతమే.. ● రైతులకు వ్యవసాయబావులే ఆధారం ● రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు అంతంతే..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభమై జూన్, జూలై నెలలు గడిచినప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతున్నాయి. ఒక్కటి, రెండు మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ పెద్దగా చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు నిండిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షంతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, పెసర పంటలకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయితే నాలుగైదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఆరుతడి పంటలు సైతం వాలిపోతున్నాయి. ఇక వరి పొలాలు సాగు చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాబోయే ఐదు రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా లేవని, చిరుజల్లులకే పరిమితం కావచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జిల్లా అంతటా లోటు వర్షపాతమే..
ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇప్పటికి జిల్లాలోని 20 మండలాల్లో అంతంటా లోటు వర్షాపాతమే కనిపిస్తోంది. జిల్లాలో ఆగస్టు 1 నాటికి సాధారణ వర్షాపాతం 445.7 మి.మీ ఉండాల్సి ఉండగా.. 331.6 మి.మీ. మాత్రమే కురిసింది. జిల్లా అంతటా సగటున 26 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 28 మి.మీ, మల్లాపూర్‌లో 6.0 మి.మీ, రాయికల్‌లో 27.0 మి.మీ, బీర్‌పూర్‌లో 27.0 మి.మీ, సారంగాపూర్‌లో 10.0 మి.మీ, ధర్మపురిలో 27.0 మి.మీ, బుగ్గారంలో 35.0 మి.మీ, జగిత్యాల రూరల్‌లో 23.0 మి.మీ, జగిత్యాలలో 30.0 మి.మీ, మేడిపల్లిలో 15.0 మి.మీ, కోరుట్లలో 26.0 మి.మీ, మెట్‌పల్లిలో 40.0 మి.మీ, కథలాపూర్‌లో 32.0 మి.మీ, కొడిమ్యాలలో 19.0 మి.మీ, మల్యాలలో 26.0 మి.మీ, పెగడపల్లిలో 24.0 మి.మీ, గొల్లపల్లిలో 31.0 మి.మీ, వెల్గటూర్‌లో 35.0 మి.మీ, ఎండపల్లిలో 29.0 మి.మీ, బీమారంలో 16.0 మి.మీ తక్కువ వర్షాపాతం నమోదైంది.
వ్యవసాయబావులపైనే ఆధారం
జిల్లాలో లోటు వర్షాపాతం ఏర్పడటంతో రైతులు వ్యవసాయబావుల్లో ఉన్న నీటిపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో వానాకాలం సీజన్ పంటలన్నీ వర్షాధారంపైనే పండేవి, అవసరమైనప్పుడు బావి ద్వారా ఒక్కటి రెండు నీటి తడులు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురువకపోవడంతో పూర్తిగా వ్యవసాయబావులపైనే ఆధారపడుతుండటంతో ఆ బావులు సైతం అడుగంటుతున్నాయి.