
ఉపాధ్యాయులకూ ముఖ హాజరు
● విద్యార్థులకు ఉపయోగించే యాప్ వినియోగం ● అన్ని పాఠశాలల్లో అమలు ● తొలిరోజు 70శాతమే నమోదు
జగిత్యాల: విద్యార్థులకే పరిమితమైన ముఖ గుర్తింపు హాజరు శుక్రవారం నుంచి ఉపాధ్యాయులకు సైతం అమలవుతోంది. గతంలో విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడంతో హాజరు మాత్రం ఉండటంతో డుమ్మా కొట్టే విద్యార్థుల కోసం ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం(ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేశారు. ఉపాధ్యాయులకు సైతం అమలు చేయడంతో విధులకు డుమ్మా కొట్టే వారికి చెక్ పడే అవకాశం ఉంది.
డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అమలు
విద్యార్థులకు ఉపయోగిస్తున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ యాప్ ద్వారానే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీ చింగ్ సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదట పెద్దపల్లి జిల్లాలో చే పట్టగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో చేపడుతున్నారు.
తొలిరోజు 70 శాతం
ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు కావడంతో జగిత్యాల జిల్లాలో తొలిరోజు డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా 70 శాతం హాజరు నమోదైంది. 30 శాతం ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కాలేదు.
సర్వర్ సమస్య:
జిల్లాలో ఒకేసారి ఒకే సమయంలో అందరు ఒకే యాప్‌లో నమోదు చేయడంతో సర్వర్ సమస్యగా మారింది. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు చాలా సేపు ప్రయత్నించినా సర్వర్ సమస్యతో అటెండెన్స్ పడలేదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచే యాప్ అమలులోకి వచ్చినప్పటికీ వారం రోజుల వరకు చూడటం జరుగుతుందని విద్యాధికారులు తెలిపారు.
ముఖ హాజరు తప్పనిసరి
ఉపాధ్యాయుల ముఖ హాజరు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. తొలిరోజు సర్వర్ సమస్య వచ్చింది. వారం రోజుల పాటు ఇది గమనించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటాం.
– రాము, డీఈవో

ఉపాధ్యాయులకూ ముఖ హాజరు