
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
● మందులు అందుబాటులో ఉంచాలి ● సమయపాలన పాటించాలి ● రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్
జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో వసతులు, రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు నిత్యం సమీక్షించాలని సూచించారు. ముఖ్యంగా కాలానుగుణంగా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజూ వస్తున్న ఓపీ వివరాలను నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో అందుతున్న ల్యాబ్ సేవలు మెరుగ్గా ఉండాలని తెలిపారు. జగిత్యాల జిల్లా సిజేరియన్లలో 75 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, దీనిని తగ్గించి సాధారణ ప్రసవాలు అయ్యేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
మల్యాల పీహెచ్‌సీ సందర్శన
మల్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని –రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్ శుక్రవారం సందర్శించారు. సేవల నాణ్యత, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవలు, మతా శిశు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు అర్చన, ఏఎంవో సత్యనారాయణ, మండల వైద్యురాలు మౌనిక, తదితరులు పాల్గొన్నారు.