● నాలుగేళ్లుగా నిలిచిపోయిన పనులు ● మరమ్మతుకు నోచుకోని చెక్‌డ్యామ్‌లు ● ఈజీఎస్ ద్వారానే సమతుల కందకాలు
2021 వరకు అడవుల్లో భారీగా అభివృద్ధి పనులు
● సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలతోపాటు, ఇతర మండలాల్లోని అటవీప్రాంతంలో 2021 సంవత్సరం వరకు నిరంతరం కంపా నిధులతో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాయి. ఆ తరువాత నిధుల విడుదల నిలిచిపోవడంతో పనుల్లో పురోగతి లేదు.
● కేవలం ఈజీఎస్ ద్వారా ఉపాధిహమీ కూలీలకు పని కల్పించడంలో భాగంగా అడవుల్లో సమతుల కందకాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఏర్పాటు చేసిన సమతుల కందకాలు మరో సంవత్సరం కనిపించడం లేదు.
● బీర్‌పూర్ మండలం రోల్లవాగు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న అటవీశాఖ భూములకు రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖకు పరిహారం చెల్లించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పరిహారం సొమ్ముతో ఈ ఏడాది సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలతోపాటు పలు మండలాల్లో అడవుల్లో చెక్‌డ్యాంలు, పెద్ద నీటి కుంటలు, చిన్న నీటి కుంటలు, రాక్‌ఫిల్‌డ్యాంలు, స్టాగర్డ్ ట్రెంచెస్ వంటివి చేపట్టడానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
సారంగాపూర్: అడవులను అభివృద్ధి చేసి.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అటవీశాఖ చేపట్టే పనులకు నాలుగేళ్లుగా గ్రహణం పట్టుకుంది. నిధుల లేమితో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటవీశాఖ పరిధిలోని కంపా (కాంపెన్‌సేటరీ అఫోర్‌సియేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అథారిటీ) ద్వారా వివిధ అభివృద్ధి పనులు 2021 వరకు కొనసాగాయి. అప్పటి నుంచి అటవీశాఖ అటవీప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టాల్సిన పనులు కూడా నిలిచిపోయాయి.
అడవుల్లో అటవీశాఖ చేపట్టిన పనులు
జిల్లాలో అడవుల విస్తీర్ణం సుమారు 50 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. ముఖ్యంగా సారంగాపూర్, బీర్‌పూర్, రాయికల్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. అడవుల్లో పచ్చదనం పెంచడంతోపాటు, భూగర్భజలాల పెంపుకోసం చాలా కార్యక్రమాలు నిర్వహించి, అందుకు అనుగుణంగా ఫలితాలు సాధించింది. అటవీశాఖ భూగర్భజలాలను పెంచడం, పచ్చదనం కాపాడడం.. అడవుల్లో కలప అక్రమ రవాణాను అరికట్టడం, అరుదైన జాతులకు చెందిన మొక్కలు, వృక్షాలను కాపాడి, అడవుల్లోని ప్రతి వన్యప్రాణిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు అమలయ్యాయి.
● ఎత్తైన గుట్టల మీదినుంచి వచ్చే వర్షపు నీరు వాగుల ద్వారా గోదావరిలో కలవకుండా ఎక్కడి నీటి చుక్క అక్కడే భూమిలో ఇంకిపోవాలన్న లక్ష్యంతో అటవీశాఖ ఆధ్వర్యంలో రాక్‌ఫిల్ డ్యాంలు (రాతి కట్టడాలు) నిర్మించారు. గుట్టరాళ్లనే అడ్డుగా కట్టి ఎక్కడినీరు అక్కడే ఇంకిపోయేలా నిర్మాణం చేశారు.
● అటవీశాఖ చిన్న మొత్తంలో వాగుల్లోని నీరు కిందికి పోకుండా రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించి చెక్‌డ్యాంలు నిర్మించింది. ఇది భూగర్భజలాల పెంపులో కీలకంగా మారాయి.
● అటవీప్రాంతాల్లో లోతట్టు మైదానాలు ఉండి.. ఎగువ నుంచి వర్షంనీరు వస్తే ఆ నీటిని అక్కడే నిల్వ చేయడానికి పర్క్యులేషన్ ట్యాంక్‌లు (నీటి నిలువ కుంటలు), మినీ పర్క్యూలేషన్ ట్యాంకులను రూ.2 లక్షల వరకు వెచ్చించి నిర్మించారు. వీటిద్వారా వర్షం నీరు ఆగి అటు వన్యప్రాణులు, భూగర్భ జలాల పెంపునకు తోడ్పడింది.
● స్టాగర్డ్ ట్రెంచెస్ లక్ష్యం కూడా భూగర్భ నీటి నిల్వలను పెంచడానికి చేపట్టారు. ఎక్కడ వీలుంటే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో ఎక్కడి నీటి బొట్టు అక్కడే ఇంకిపోయే విధంగా ఉపయోగపడింది.