
నేర పరిశోధన సమర్థవంతంగా చేయాలి
జగిత్యాలక్రైం: పోలీసులు నేర పరిశోధన సమర్థవంతంగా నిర్వహించాలని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్షించారు. ఆర్నెళ్లలో పోలీస్‌స్టేషన్ల పనితీరు, కేసుల చేధనలో పురోగతిని పరిశీలించారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలో కేసుల స్థితిగతులను సమీక్షించాలన్నారు. మహిళల భద్రత లక్ష్యంగా పనిచేయాలని, వారిపై అసభ్యంగా ప్రవర్తించినా.. దాడులకు పాల్పడినా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దొంగతనాల నివారణకు స్పెషల్ టీంను నియమించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు, వాహన తనిఖీలు తప్పకుండా నిర్వహించాలన్నారు.
గణేశ్ ఉత్సవాలకు భద్రత
గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా పోలీసులు చూడాలని అధికారులకు సూచించారు. నిర్వాహకులతో సీఐలు, ఎస్సైలు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. నేరాలు చేసేవారిని, నేర స్వభావం కలిగిన వ్యక్తులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీనివాస్, ఆర్‌ఐ వేణు, సీఐలు సుధాకర్, కరుణాకర్, రాం నర్సింహారెడ్డి, సురేశ్, ఎస్సైలు, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి నిర్మూలనలో పోలీసుల పనితీరు అద్భుతం
గంజాయి నిర్మూలనలో పోలీసుల పనితీరు అద్భుతమని ఎస్పీ అన్నారు. గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసుల కృషిని గుర్తించి నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శౌండిల్య రివార్డు ప్రకటించి అభినందించారు. జిల్లాలో రవాణా, నిల్వలను గుర్తించడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.
పెండింగ్ కేసులు సత్వరం పరిష్కరించాలి
ఎస్పీ అశోక్ కుమార్