
ఎరువుల నిల్వల తనిఖీ
మేడిపల్లి: మేడిపల్లి, వల్లంపల్లి పీఏసీఎస్‌లో ఎరువుల నిల్వలను డీఏవో భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. ఎకరా ఉన్న రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని, ఈ–మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీపై అవగాహన కల్పించాలన్నారు. ఏఓ షాహిద్ అలీ, రవీందర్‌రావు, ఈఓ తొర్తి గోపి రైతులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానాకు డీఎంహెచ్‌వో
ధర్మపురి: ధర్మపురిలోని బస్తీ దవాఖానాను బుధవారం డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీకాలు సకాలంలో ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రోగ్రాం అధికారి రవీందర్, వైద్యాధికారి వివేక్, సీహెచ్‌వో శాంతి, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు తదితరులున్నారు.
స్కాలర్‌షిప్ విడుదల చేయాలి
జగిత్యాల: ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కళాశాల యజమానుల సంఘం నాయకులు బుధవారం సంక్షేమాధికారి రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. 2024–25 నుంచి ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తోందని, ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, అయితే రాష్ట్రం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. జిల్లా డిగ్రీ కళాశాల యజమాన్య సంఘం నాయకులు శ్రీపాద నరేశ్, కొక్కుల రాజేందర్, ప్రవీణ్‌కుమార్, ప్రకాశ్‌మూర్తి, రాజేందర్ పాల్గొన్నారు.