
పంచాయతీ రికార్డుల్లో గోల్‌మాల్
● ఇళ్ల మార్పిడికి బాధితుల దరఖాస్తు ● యజమానుల ప్రమేయం లేకుండానే మరొకరి పేరిట ● బదిలీపై వెళ్లిన కార్యదర్శి చేతివాటం..? ● ఇబ్రహీంనగర్ (శ్రీరాముపల్లి)లో వెలుగులోకి
గొల్లపల్లి: గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ (శ్రీరాముపల్లి)లో పంచాయతీ రికార్డులకు భద్రత కరువైంది. ఇంటి మార్పిడి కోసం దరఖాస్తు సమర్పిస్తే ఆస్తి మార్పిడి కాపీ ఇచ్చి రికార్డులో నమోదు చేయక చేతివాటం ప్రదర్శించారు ఇక్కడి అధికారులు. డిమాండ్ రిజిస్టర్‌లో అసెస్‌మెంట్ల నంబర్లతో ఉన్న యజమానుల పేర్లు.. మరో ఏడాది మరొకరి ఇంటి యజమానుల పేరిట మార్పిడి అయ్యాయి. ఇదంతా ఇళ్ల యజమానులకే తెలియకుండా జరిగిపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి చేతివాటంతోనే ఇలాంటివి చోటుచేసుకున్నట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ తతంగాన్ని ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరిగింది..?
ఇబ్రహీంనగర్ పంచాయతీ కార్యదర్శిగా 2021 ఏప్రిల్ 10న మల్లికార్జున్ విధుల్లో చేరారు. 2024 ఫిబ్రవరి 21వరకు పనిచేశారు. ఆ సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ముద్దం భూమయ్య చనిపోగా.. ఆయన కొడుకు మొండయ్య ఇంటినంబర్ 5–3కి మార్పిడికి ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు పెట్టుకున్నాడు. భూమయ్య పేరిటే రికార్డులో రాసి.. మార్పిడి చేసినట్లు ఆస్తిమార్పిడి పత్రం అందించాడు. ఈ విషయం బాధితులకు ఆలస్యంగా విషయం తెలియడంతో న్యాయం చేయాలని 2025 మార్చి 3న ప్రజావాణిలో ఫిర్యాదు చేసాడు మొండయ్య. విచారణ జరిపిన అధికారులు ఆన్‌లైన్ మార్పిడి చేయకుండా అనుమతి ఇచ్చినట్లు గుర్తించారు. ఫౌల్ట్రీ, ఫర్టిలైజర్, వ్యాపారుల వద్ద కూడా ఇలాగే చేసాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా మోసపోయిన వారు గ్రామంలో 84 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కార్యదర్శి డిమాండ్ రిజిస్టర్ కూడా మెయింటేన్ చేయలేదనే అధికారులు గుర్తించినట్లు సమాచారం.
పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండానే..
ప్రస్తుతం కార్యదర్శిగా రాజ్‌కిషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2024 ఫిబ్రవరి 2న విధుల్లో చేరారు. ఈ ఏడాది మే 30న గ్రామానికి చెందిన బండారి రాజయ్య వచ్చి ఇంటి నంబర్ 1–29 బండారి బాలయ్య పేరు నుంచి బండారి సాయిలు పేరిట మార్పిడి జరిగిందా వాకబు చేశాడు. అలాగే ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి కూడా కొన్ని వివరాలు అడగడంతో కార్యదర్శి ఈ–పంచాయతీ పోర్టల్‌లోని ఆన్‌లైన్ డిమాండ్ రిజిస్టర్ పరిశీలించారు. అందులో 2024–25లో ఉన్న ఇంటి యజమానుల పేర్లు.. 2025–26లోని రిజిస్టర్‌లో చూస్తే 25 మంది పేర్లు వేరుగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఎవరైనా ఇంటి యజమాని మరణిస్తే పేరు మార్పులు, చేర్పులు, మ్యూటేషన్ ద్వారా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి.. సిటిజన్ సర్వీసెస్ లాగిన్‌లో ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత పంచాయతీ కార్యదర్శి ఆన్‌లైన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ మాత్రం పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండానే ఈ–పోర్టల్‌లో పేర్లు మారడం గమనార్హం. ఈ–పంచాయతీ పోర్టల్ లాగిన్ కార్యదర్శి వెబ్‌సైట్ నుంచి లేదా పంచాయతీ కమిషన్ లాగిన్‌లో తప్ప ఇతరత్రా అవకాశం ఉండదు. కానీ.. 25మంది ఇంటి యజమానుల పేర్లు కార్యదర్శి ప్రమేయం లేకుండానే మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి పనా..? లేకుంటే సైబర్ నేరగాళ్ల పనా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం..
గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వల్ల తాము మోసపోయామని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఓ ఉన్నతాధికారి ప్రమేయంతోనే విచారణలో జప్యం జరుగుతోందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డులకే భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఒక్కరి పేరిటే చేసిండు
మేం ఇద్దరం అన్నదమ్ములం. మా అమ్మ లక్ష్మీనర్సు పదేళ్ల కిత్రం చని పోయింది. ఆమె పేరిట ఉన్న ఇంటి ఆస్తిని మా పేరిట చేయాలని అప్పటి కార్యదర్శి మల్లికా ర్జున్‌ను కోరితే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మా అన్న పేరిటే ఉన్నదంతా చేసిండు. ఇప్పుడు మా అన్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నడు. నా పేరిట జాగ లేక రాలేదు. ఇప్పటికీ ఆన్‌లైన్‌లో మా అమ్మ పేరే చూపిస్తోంది. – పొనగంటి దేవయ్య
నా భర్త పేరు తొలగించారు
నా భర్త లక్ష్మీరాజం పదేళ్ల కిత్రం చనిపోయిండు. ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. ఘ ర్‌పట్టి కడుతున్నం. మార్చిలో కూడా చెల్లించిన. ఇంటిని నా పేరిట చేయాలని దరఖాస్తు పెట్టలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం వేరే వ్యక్తి పేరిట చూపిస్తోంది. నాకు న్యాయం చేయాలి.
– జుంజుపెల్లి పోశవ్వ, ఇబ్రహీంనగర్
అధికారులకు ఫిర్యాదు చేశా
నా ప్రమేయం లేకుండా ఈ–పంచాయతీ పోర్టల్‌లోని ఆన్‌లైన్ డిమాండ్ రిజిస్టర్ 25 మంది ఇళ్ల యజమానుల పేర్లు మార్పిడి అయ్యాయి. దీనిపై పంచాయతీ శాఖ అధికారులు, పోలీస్, సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశాం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– రాజ్‌కిషన్, పంచాయతీ కార్యదర్శి
ఉన్నతాధికారులకు నివేదించా
ఆస్తి మార్పిడికి దరఖాస్తు చేసుకుంటే పత్రం ఇచ్చి.. రికార్డులో నమోదు చేయలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. కార్యదర్శి ఫిర్యాదుతో రిజిస్టర్లను పరిశీలిస్తే 25 మంది పేర్లు మారినట్లు గమనించాం.
– సురేష్ రెడ్డి, ఎంపీవో, గొల్లపల్లి

పంచాయతీ రికార్డుల్లో గోల్‌మాల్

పంచాయతీ రికార్డుల్లో గోల్‌మాల్

పంచాయతీ రికార్డుల్లో గోల్‌మాల్