
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి ● గ్రామాలు, పట్టణాల్లో ఫ
జగిత్యాల: గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. వర్షాలతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, విస్తృతంగా పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. నీరు నిలిచిన చోట వెంటనే ఆయిల్‌బాల్స్ వేయించాలని సూచించారు. తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, జ్వరాలు వచ్చిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి పరిస్థితుల్లనైనా స్పందించేలా ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రవాహం మీదుగా ప్రజల రాకపోకలు సాగించకుండా నిషేదం విధించాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విస్తీర్ణం అధారంగా ఎరువులు అందించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు అందించాలని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఎరువులు కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని ఎరువుల గోదాంను పరిశీలించారు. యూరియా విక్రయాలను పరిశీలించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, ఏడీఏ భాస్కర్, ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు.
కొడిమ్యాల ఆస్పత్రి సందర్శన
కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. రోగుల ఓపీ, ఐపీ వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పనులను ఎప్పటికప్పుడు చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఎస్‌హెచ్‌వో రాజశేఖర్, స్థానిక వైధ్యధికారులు నరేష్, పరమేశ్వరి, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.