చెరువుల సమీపంలోనే నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు

Jul 21 2025 5:39 AM | Updated on Jul 21 2025 5:39 AM

చెరువ

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు

బఫర్‌ జోన్‌లో

యథేచ్ఛగా కట్టడాలు

వరద ప్రవాహానికి అడ్డుగా పనులు

ప్రజలకు పొంచి ఉన్న ముప్పు

ఎక్కడా కనిపించని హద్దులు

జగిత్యాల: జిల్లాకేంద్రం చుట్టూ ఐదు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. వాటికి సమీపంలోనే ఇళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షకాలంలో వరదనీటి ప్రవాహా నికి అడ్డుగా నిర్మాణాలు చేపడుతుండడంతో సమీపంలోని ఇళ్లను ముంచెత్తుతోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లాకేంద్రం శివారులోని చింతకుంట చెరువును కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఇటీవల పరి శీలించారు. బఫర్‌జోన్‌లోనే అత్యధికంగా నిర్మాణాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలు ఉంటే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న ఐదు చెరువులకు సమీపంలోనే కొత్తకొత్త ఇళ్లు వెలుస్తున్నాయి. ఇందులో అధికంగా బఫర్‌జోన్‌తోపాటు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా చెరువులు మొత్తం కబ్జాకు గురైతే ప్రజలకు ఇబ్బందికరంగా మారనుంది. వర్షకాలంలో వరద ప్రవాహం వెళ్లే దారి లేక ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది.

ఫైపాండ్స్‌ ఆఫ్‌ సిటీ ఎక్కడ?

జిల్లా కేంద్రాన్ని ఆనుకుని మోతె, అంతర్గాం, చింతకుంట, కండ్లపల్లి, గోవిందుపల్లి గొలుసుకట్టు చెరవులను కలిపి ఫైపాండ్స్‌ ఆఫ్‌ సిటీ అని చెబుతుంటారు. ప్రస్తుతం ఆ చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ముఖ్యంగా మోతె, కండ్లపల్లి, చింతకుంట చెరువుల సమీపంలోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. గతంలో నిర్మించినవే అధికంగా బఫర్‌జోన్‌లో ఉన్నాయని అనుకుంటే.. కొత్తగా అనేక ఇళ్లు ఇక్కడ వెలిశాయి. మోతె చెరువు 406 సర్వేనంబరులో 90.23 ఎకరాలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం అది 40ఎకరాలు కూడా లేదు. దాని చుట్టూ ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్‌ భూములు అయినప్పటికీ పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. ప్రధాన చెరువైన మోతె చెరువుకు అంతర్గాం నుంచి ధరూర్‌, నర్సింగాపూర్‌ మీదుగా కెనాల్‌ నీరు వస్తుంది. మోతె చెరువు నుంచి ముప్పారపు చెరువుకు నీరు వెళ్తుంది. ఈ కాలువ సైతం కబ్జాకు గురికావడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద ప్రవాహం ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. గోవిందుపల్లి సమీపంలో ఉన్న వెంకటాద్రినగర్‌లో కాలువ పూర్తిస్థాయిలో కబ్జాకు గురికావడంతో పట్టణంతోపాటు వెంకటాద్రినగర్‌కు రాకపోకలు స్తంభించిపోతాయి. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

కాలువల్లో ముళ్లపొదలు

చెరువులకు సంబంధించిన కాలువల్లో ముళ్ల పొదలు పేరుకుపోయాయి. దీంతో నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చెరువులు నాలుగు వైపులా ఉండటం.. కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోవడం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కలెక్టర్‌ చొరవ తీసుకుని జిల్లా కేంద్రంలోని నాలాల వద్దనున్న ముళ్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకోవడంతో కొద్దిమేర క్లీన్‌ అయ్యాయి. ప్రజావాణిలోనూ కలెక్టర్‌కు చెరువుల కబ్జాపై అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా తరహాలో ఇక్కడ కూడా కొత్త వ్యవస్థ రావాలని స్థానికులు ఆశిస్తున్నారు.

చెరువులకు హద్దులు ఎక్కడ?

జిల్లా కేంద్రంలో చుట్టూ ఉన్న చెరువులకు హద్దులు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. మూడు రోజుల్లో హద్దులు నిర్ణయించి మ్యాప్‌లు ఇవ్వాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అత్యధికంగా భూముల ధరలు పెరగడంతో చెరువులు, భూములను కబ్జా చేస్తూ ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. హద్దులు ఏర్పాటు చేసి బౌండరీలు ఏర్పాటు చేస్తే కబ్జాకు గురికాకుండా ఉంటాయి. మొత్తం హద్దులు నిర్ణయించి ఏ మేరకు కబ్జా అయ్యాయో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ కట్టడాలపై చర్యలు

జిల్లాలోని చెరువుల చుట్టూ అత్యధికంగా బఫర్‌జోన్లు, ఎఫ్‌టీఎల్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు దృష్టికి వచ్చింది. అధికారులను ఆదేశించాం. అక్రమ కట్టడాలున్నట్లయితే నోటీసులు జారీ చేయాలని సూచించాం. ప్రధాన నాలాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశాం.

– సత్యప్రసాద్‌, కలెక్టర్‌

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు1
1/3

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు2
2/3

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు3
3/3

చెరువుల సమీపంలోనే నిర్మాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement