దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్‌రెడ్డి

Jul 21 2025 5:39 AM | Updated on Jul 21 2025 5:39 AM

దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్‌రెడ్డి

దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్‌రెడ్డి

● బీజేపీ పాదయాత్రతో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపించాలి ● జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి ● సోమేశ్వర కొండ వద్ద బీజేపీ పాదయాత్ర ప్రారంభం

మల్లాపూర్‌: దేవుళ్లపై ఓట్టేసి రైతులను మోసం చేసిన ఘనుడు సీఎం రేవంత్‌రెడ్డి అని జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన చలో ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పాదయాత్రను మండలకేంద్రంలోని సోమేశ్వర కొండ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ నడిచేవాటినే మూసివేయించారని తెలిపారు. ఫ్యాక్టరీలు నడిచిన సమయంలో 1.20 లక్షల ఎకరాల్లో చెరుకు సాగయ్యేదని, ఇప్పుడు 10వేల ఎకరాలకు పడిపోయిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఆర్నెళ్లలోనే షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి మూసీనది సుందరీకరణ, అందాల పోటీలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని, రైతుల కోసం మాత్రం రూ.500 కోట్లు ఖర్చు పెట్టేందుకు మనసు రావడం లేదని తెలిపారు. అధ్యయన కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిచేవరకూ వరకు బీజేపీ రైతుల ఫక్షాన పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు, నరేందర్‌, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, మాజీ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణరావు, మండల ఇన్‌చార్జి వడ్డేపల్లి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, బీజేవైఎం జిల్లా ఉపాద్యాక్షుడు బైన ప్రశాంత్‌, మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, నాయకులు కాంతయ్యచారి తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాక్టరీ వద్ద ముగిసిన పాదయాత్ర

పాదయాత్రలో వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చెరుకు రైతులు పాల్గొన్నారు. మల్లాపూర్‌ నుంచి కుస్తాపూర్‌, సిరిపూర్‌, రాఘవపేట మీదుగా ముత్యంపేటలోగల షుగర్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. ముగింపు సభల్లో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. రైతులకు కమిటీలు, పాతబకాయిల చెల్లింపులు కాదని, ఫ్యాక్టరీలను తెరవడమేనని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకుందన్నారు. ముత్యంపేట ఫ్యాక్టరీ వద్ద బస చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోపే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి 18 నెలలైన పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే చెరుకు రైతులతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement