
కలవరపెడుతున్న వరుస హత్యలు
● ఈనెల 17న.. వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30)ను మండలకేంద్రంలో కత్తులతో పొడిచి చంపారు. ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
● ఈనెల 5న కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన హితాక్షి (6)ని చిన్నారి చిన్నమ్మ మమత గొంతులో పొడిచి హత్యచేసింది. కుటుంబసభ్యులు తనను అడుగడుగునా అవమానిస్తున్నారని, హేళన చేస్తున్నారని పగ పెంచుకుని పథకం ప్రకారం చిన్నారిని హతమార్చింది.
● ఈనెల 10న.. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన గొల్లెన రవి (30)ని వరుసకు అన్నయ్య అయిన నాగరాజు ఇంటి నిర్మాణం, భూ తగాదాలతో పగ పెంచుకుని కత్తితో దాడిచేసి హత్యచేశాడు.
● భూతగాదాలు, వివాహేతర సంబంధాలే కారణం
● జిల్లాలో నిత్యం ఏదోచోట సంఘటనలు
● పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగని వైనం
జగిత్యాలక్రైం: జిల్లాలో ఇలాంటి వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. అటు ప్రజలు, ఇటు పోలీసువర్గాల్లోనూ ఆందోళన మొదలైంది. నేర సంస్కృతిని తగ్గించేందుకు పోలీసులు హత్యల్లో ప్రమేయం ఉన్నవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలిస్తున్నారు. గతంలో కేసులు ఉండి.. హత్యల్లో ప్రమేయం ఉన్నవారిపై రౌడీషీట్‌లు, పీడీయాక్ట్ నమోదు చేస్తున్నారు.
భూ తగాదాలు.. వ్యక్తిగత ద్వేషాలు
వరుస హత్యలకు ప్రధాన కారణం భూతగాదాలు, వ్యక్తిగత ద్వేషాలు, వివాహేతర సంబంధాలు, ప్రేమోన్మాదం, పరువు పోతుందనే ప్రధాన కారణంగా పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. మారుతున్న సమాజంలో టెక్నాలజీ, చట్టాలు తెలిసినా నేరం చేయడానికి నింధితులు వెనుకాడటం లేదు. చిన్నపాటి విషయాలకు కూడా క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు.
నిందితుల గుర్తింపులో టెక్నాలజీ
నేరాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితోపాటు పరోక్షంగా వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని కూడా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ప్రజలు నేరాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతోనే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్నచిన్న గొడవలు జరుగుతున్న సమయంలో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపడుతుండటంతో పెద్దనేరాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.
రౌడీషీట్, పీడీయాక్ట్ కేసులు
ఎవరిపైనన ఒకట్రెండు కేసులు ఉంటే వారిని నేర ప్రవృత్తి నుంచి దూరం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అలకాని పక్షంలో రౌడీషీట్, పీడీయాక్ట్ ఓపెన్ చేస్తున్నారు. హత్య కేసులో ప్రమేయం ఉంటే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. ఒకట్రెండు నాన్‌బెయిలబుల్ నేరాలకు పాల్పడినవారిపై రౌడీషీట్, పీడీయాక్ట్ ఓపెన్ చేస్తున్నారు. రౌడీషీటర్ల కదలికలపై పెట్రోలింగ్ సిబ్బంది, 100 డయల్ సిబ్బంది ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేశారు.
నిందితులపై చర్యలు
నేరాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు చేపడుతున్నాం. ప్రోత్సహించిన వారిని కూడా టెక్నాలజీ సహాయంతో గుర్తిస్తున్నాం. ఒకట్రెండు కేసుల్లో పాల్గొంటే రౌడీషీట్, పీడీయాక్ట్ ఓపెన్ చేస్తున్నాం. చిన్నపాటి గొడవలకే క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు.
– అశోక్‌కుమార్, ఎస్పీ

కలవరపెడుతున్న వరుస హత్యలు