
ముమ్మరంగా వరి నాట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. జూన్ 15 తర్వాత నారు పోసిన రైతులు.. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. పొలం దున్నేందుకు సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో బావుల ద్వారా నీరు అందిస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారుల అంచనా. ఈ ఏడాది వర్షాలు అంతంతే ఉండటంతో ఏ మేరకు వరి సాగు చేస్తారనేది అంచనా వేయలేకపోతున్నారు. మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, మల్యాల వంటి మండలాలు నాన్‌కమాండ్ ప్రాంతాలు. ఇక్కడ సాగునీటికి ఇబ్బందే. కాలువల కింద ఉన్న రైతులందరికీ దాదాపు వ్యవసాయ బావులు ఉన్నాయి. ఇప్పటివరకు కాలువల ద్వారా నీరు రాకున్నా.. ఉన్న వ్యవసాయ బావుల ద్వారా నీరు అందించి పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నిండితే సాగునీరు వచ్చే అవకాశం ఉంటుందనే ఆశతో కూడా నార్లు పోసి నాట్లు వేస్తున్నారు.
వ్యవసాయ బావులపైనే అధారం
వర్షాలు కురవకపోవడంతో పొలాల దున్నకం రైతులకు ఇబ్బందిగా మారింది. బావులకు మోటార్లు బిగించి పొలానికి తడులు పెడుతున్నారు. రైతులందరూ ఒకేసారి మోటార్లు ఆన్ చేస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ ఎక్కువై కరెంట్ ట్రిప్ అవుతోంది. కొన్ని ప్రాంతాలోల ఫ్యూజులు కాలిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నారు ముదిరిపోతోంది. నారు పోసిన నెలలోపు నాట్లు వేస్తే మంచి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తుండడం.. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది.
నారు తరలించడం ఇబ్బందే..
సాధారణంగా రైతులు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా.. నారును ఒకేచోట పోస్తుంటారు. నారు ఏపుగా పెరిగాక పొలంలో పంచడం రైతులకు ఇబ్బందిగా మారింది. నారును చీరలో లేదా తట్టు కవర్లలో పెట్టుకుని మడుల్లోకి వెళ్లి వేయాల్సి రావడం కష్టమవుతుంది. కూలీలు నారును పంచేందుకు దొరకడం లేదు. ఎక్కడైనా దొరికితే వారం ముందే అడ్వాన్స్‌లు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. మగకూలీలకు రోజుకు కనీసం రూ.వెయ్యితోపాటు మద్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాటు వేసేందుకు ఆడకూలీలకు రూ.500 ఇస్తున్నారు.
ఆకాశాన్నంటిన డీఏపీ ధరలు
నాట్లు వేసే సమయంలో రైతులు డీఏపీ వేస్తుంటారు. డీఏపీ ఒక బస్తా ధర రూ.1400వరకు ఉంది. మార్కెట్‌లో సరిగ్గా దొరకకపోవడంతో బ్లాక్‌లో మరింత రేటు పెట్టి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నాటు వేసిన వారం లోపు కలుపు మొక్కలు రాకుండా గడ్డి మందు చల్లుతున్నారు.
వర్షం నీరు అంతంతే
వ్యవసాయబావులపైనే ఆధారం
నాట్ల సమయంలో రైతన్నల ఇబ్బందులు

ముమ్మరంగా వరి నాట్లు