
మహిళల భద్రతకు ‘భరోసా’
● ఒకేచోట తక్షణ న్యాయ సహాయం, వైద్యసేవలు
జగిత్యాలక్రైం: మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. మహిళలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందేలా చూస్తోంది. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, చిత్రహింసల కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. లైంగికదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో తక్షణ సాయం కోసం శ్రీభరోసాశ్రీ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా కేంద్రంలో పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గతేడాది పోలీసుశాఖ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించారు. నిరాదరణకు గురైన పిల్లలు, మహిళలకు ఈ కేంద్రంలో తక్షణ వైద్యం, న్యాయ సాయం, కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. కేంద్రంలో వసతి నిపుణులు అండగా ఉండి నిందితులకు శిక్ష పడేలా చూస్తున్నారు. బాధిత పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించేలా చర్యలు తీసుకుంటారు. 14 ఏళ్లలోపు పిల్లలు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైన వారు, మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేసి తక్షణ సాయం కోసం భరోసా కేంద్రానికి పంపుతారు. కేంద్రంలో ముందుగా ఏఎన్‌ఎం వైద్య సాయం అందిస్తారు. పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. భరోసా కేంద్రం ఎస్పీ పర్యవేక్షణలో మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సీసీఎస్ సీఐ, హెడ్ కానిస్టేబుల్, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, బాధితులకు సాయంగా ఉండేందుకు మరో మహిళ, లీగల్ అడ్వైజర్ ఉంటారు. జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపులోని ఎస్పీ కార్యాలయం పక్కనే ప్రైవేట్ భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి గత సంవత్సర కాలంగా బాధితులకు అన్ని రకాలా అండగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువుతులు తక్షణ సాయం కోసం 100కు డయల్ చేయటం, లేదా సమీప స్టేషన్‌కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు.
మహిళలకు భరోసా
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లాలో లైంగికదాడులు, నిరాదరణకు గురైన 14 ఏళ్లలోపు ఆడపిల్లలు, మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నాం. వైద్య, న్యాయ సాయంతోపాటు నిందితులకు శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకుంటారు.
– అశోక్‌కుమార్, ఎస్పీ
జిల్లాలో నమోదైన లైంగికదాడి కేసులు
2021 : 49
2022 : 36
2023 : 42
2024 : 40
2025లో ఇప్పటి వరకు : 19