
ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం
● అందుబాటులో 240 ఐటీఐ, 172 ఏటీసీ కోర్సుల సీట్లు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో పదోతరగతి అనంతరం చాలా కోర్సులు విద్యార్థులు చదివేందుకు అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలీ కాలంలో ప్రభుత్వ విద్యార్థులల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ఐటీఐ విద్యను పటిష్టం చేసే దిశగా అడుగులు వేసింది. దీంట్లో భాగంగానే 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఐటీఐ విద్యలో కొత్త ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్) తరహా కోర్సులు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్ వేదిక దరఖాస్తులు ప్రారంభం కాగా.. తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. రెండో విడతలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రెండో విడత ఆగస్టు 31 వరకు జరగనుంది. మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు.
కరీంనగర్ కళాశాలలో..
కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్ సమీపంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) కళాశాలలో మొత్తం 412 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 240 సీట్లు ఐటీఐ కాగా.. 172 సీట్లు ఏటీసీ కోర్సుల సీట్లు. తొలి విడతలో ఐటీఐలో 54 సీట్లు అలాట్ అయ్యాయి. రెండో విడత సీట్ల కేటాయింపు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ కళాశాల కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ వై.గంగాధర్ తెలిపారు. ఐటీఐ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి రంగంలో అధిక డిమాండ్ ఉందిని పేర్కొంటున్నారు. ఉత్తీర్ణులైన వారికి నేరుగా కంపెనీలే వచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, చాలా ఉపాధి అవకాశాలున్నాయని, కచ్చితంగా ఉపాధి దొరుకుతుందంటున్నారు.
ఉపాధికి మార్గం..
ఐటీఐ చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. దినదినం ఐటీఐల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఆర్థిక భరోసాకు అండగా ఐటీఐ కోర్సులు దోహదం చేస్తాయి.
– డాక్టర్ వై.గంగాధర్, ఐటీఐ కళాశాల కమిటీ వైస్ చైర్మన్

ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం