
తెగని ‘ఇసుక’ పంచాయితీ
● ఇసుక లారీల ద్వారా ఉపాధి కల్పించాలంటూ హిమ్మత్‌నగర్‌వాసుల దీక్ష ● ససేమిరా అంటున్న కొండపాక గ్రామస్తులు ● సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం
వీణవంక: రెండు గ్రామాల మధ్య మొదలైన ‘ఇసుక’ పంచాయితీ కొనసాగుతోంది. ఎన్నోఏళ్లుగా ఒకే రెవెన్యూ గ్రామంగా కలిసిమెలిసి ఉన్న ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు బాహాబాహీకి దిగుతున్నారు. ఇసుక లారీల మీద తాటిపత్రి కప్పే ఉపాధి కొండపాక గ్రామస్తులే పొందుతున్నారని, తమకు మొండిచేయి చూపుతున్నారని వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామస్తులు పదకొండు రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్, అధికారులు కుమ్మకై ్క అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల్లో న్యాయం జరిగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు.
లారీకి రూ.వెయ్యి చొప్పున ఉపాధి
వీణవంక మండలం కొండపాక శివారులోని మా నేరువాగులో రెండు ఇసుక క్వారీలు ఉన్నాయి. నెలరోజులుగా ఒక క్వారీ ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. త్వరలో మరోక్వారీ ప్రారంభం కానుంది. ఇసుక నింపిన తరువాత లారీలపై తా టిపత్రి కప్పే ఉపాధిని కొండపాక గ్రామస్తులు పొందుతున్నారు. హిమ్మత్‌నగర్ సైతం కొండపాక రెవెన్యూ గ్రామంలో ఉండటంతో తమకూ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీజీ ఎండీసీ నిబంధనల ప్రకారం ఇసుక లారీలపై తా టిపత్రులు కప్పుకొని రవాణా చేయాలి. తాటిపత్రి కప్పితే ఒక్కో లారీ నుంచి రూ.వేయి వసూలు చేస్తున్నారు. రోజుకు 50లారీలు లోడైనా రూ.50 వేల ఉపాధి లబిస్తుంది. లారీలు హిమ్మత్‌నగర్ గ్రామం నుంచి వెళ్తున్నాయని, తమకూ ఉపాధి కల్పించాలని 20రోజులుగా ఆందోళన చేస్తున్నా రు. కేంద్రమంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, టీజీఎండీసీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే క్వారీలు తమ పరిధిలో ఉన్నందున తమకే వాటా దక్కుతుందని కొండపాక గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు.
అమరణ దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు
పదకొండు రోజులుగా హిమ్మత్‌నగర్ గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన దీక్ష చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రెండు, మూడురోజుల్లో ఆమరణదీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాభివృద్ధికి ఒక్కో లారీ నుంచి కనీసం రూ.500 ఇప్పించాలని, సబ్‌రిజిస్ట్రార్ నుంచి వచ్చే నిధులు కొండపాక రెవెన్యూలో జమవుతున్నాయని, నేరుగా హిమ్మత్‌నగర్ జీపీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొంటున్నారు.