
ధోతికట్టు..అదిరేట్టు
సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్): అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, సీ్త్రలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన సీ్త్ర, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది. పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.
పంచెకట్టు ప్రయోజనాలు
● శరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికై నా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.
● ఇక సీ్త్రల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.
● సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.
ఈ తరానికి తెలియని బొడ్లె సంచి
గోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్‌గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్‌లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.
జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..
సీ్త్ర, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్‌గా ధరించేది జీన్స్ ప్యాంట్‌నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.

ధోతికట్టు..అదిరేట్టు