
కూతురిపై వేధింపులు భరించలేకే హత్య
వెల్గటూర్: కూతురును ప్రేమ పేరిట వేధించడంతోనే వెల్గటూర్‌కు చెందిన సల్లూరి మల్లేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శనివారం నిందితులైన కిషన్‌రావుపేటకు చెందిన నైనాల రాజిరెడ్డి, నైనాల మల్లారెడ్డి, కొత్తపేటకు చెందిన చింతల హరీశ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్య వివరాలను వెల్లడించారు. మల్లేశ్ నైనాల రాజిరెడ్డి కూతురును మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. యువతి ఎక్కడికెళ్లినా వెంటపడేవాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మల్లేశ్‌పై ఫిర్యాదు చేయగా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. మల్లేశ్ గురువారం రాజిరెడ్డి ఇంటికెళ్లి అతని కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తనతో రావాలని బెదిరించాడు. ఆమె తిరస్కరించడంతో ఇంటిపై రాళ్లు విసిరాడు. దీంతో సదరు యువతి విషయాన్ని తండ్రికి ఫోన్‌లో తెలపగా మల్లారెడ్డి, చింతల హరీష్‌తో కలిసి ఇంటికి చేరారు. ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వెల్గటూర్‌కు బయల్దేరగా బైపాస్ వద్ద మల్లేశ్ కనిపించాడు. అక్కడ మల్లారెడ్డి, హరీశ్ మల్లేశ్‌పై దాడి చేశారు. రాజిరెడ్డికి ఫోన్‌లో తెలపడంతో కత్తితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ముగ్గురు కలిసి మల్లేశ్‌పై దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులో పాత వైన్స్ వెనకాల కత్తితో పొడిచి హత్య చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తి, ఆటో, దుస్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్ పాల్గొన్నారు.