
కనిపించని ‘ఊయల’
● అనాథ శిశువుల కోసం యంత్రాంగం నిర్ణయం ● ఏర్పాట్లలో జిల్లా అధికారులు తీవ్ర జాప్యం ● శిశువు వద్దనుకుంటే ‘ఊయల’లో వదిలి వెళ్లవచ్చు
ఉమ్మడి జిల్లాలోనే శిశు గృహం
జగిత్యాల: అనాథలైనా.. పిల్లలు వద్దనుకునే తల్లులైనా తమ పిల్లలను వేసి వెళ్లడానికి ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఊయల కార్యక్రమం కరీంనగర్‌లో విజయవంతం కావడంతో జగిత్యాలలోనూ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పేదరికం, ఇతరత్రా కారణాలు, ఆడపిల్ల అనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు శిశువులను చెత్తకుప్పలు, డ్రైనేజీల్లో పడేసి వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ సామాజిక ఆస్పత్రుల వద్ద ఊయలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. పుట్టిన శిశువు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలివెళ్లే అవకాశం ఉంది. అక్కడ సీసీ కెమెరాలుగానీ, నిఘా ఏమీ ఉండదు. శిశువును వదిలి వెళ్లిన వారి సమాచారం కూడా సేకరించరు. అందులో వదిలివెళ్లిన శిశువును మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారు స్వీకరించి వారి ఆలనాపాలన చూసుకునేలా వెసులు బాటు కల్పించారు. ఎవరైనా ముందుకొస్తే నిబంధనల ప్రకారం దత్తత ఇస్తారు.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే శిశు గృహం ఉండటంతో జిల్లాలోని ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు జాప్యమవుతోందని తెలుస్తోంది. శిశువులను చేరదీసిన అనంతరం వారు శిశు గృహాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఊయల ఏర్పాటు చేస్తే ఎవరైనా పిల్లలను వదిలివెళ్తే వారిని చేరదీసి కరీంనగర్‌కే పంపించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాకేంద్రంలో ఊయల ఏర్పాటు చేసేందుకు మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఓ ఏఎన్‌ఎంను నియమించనున్నారు. పిల్లలను వదిలి వెళ్లగానే చిన్నారి పూర్తి సంరక్షణ వారే చూసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1098, 112 నంబర్లకు కాల్‌చేయవచ్చు.