
దేవాదాయశాఖలోకి మల్లన్న ఆలయం
● 2021లో దేవాదాయశాఖ నుంచి మినహయింపు ● తాజాగా ఆలయ నిర్వహణను ఆధీనంలోకి తీసుకున్న అధికారులు
మెట్‌పల్లి రూరల్: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలో ఆలయం విలీనమైనా.. గ్రామస్తుల అభ్యంతరాలు, విన్నపాలతో అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2021 నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం.. సమయం పూర్తికావడంతో ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకోసం ఈవోతోపాటు 8 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారు.
పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలోకి..
పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం దేవాదాయశాఖలో విలీనం చేసింది. ఏళ్ల తరబడి గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహణ సాగిన ఈ ఆలయం దేవాదాయశాఖలో విలీనం చేయడంపై గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి దేవాదాయశాఖ నుంచి తప్పించాలని విన్నవించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. 2021 తర్వాత దేవాదాయశాఖ నుంచి తప్పించాల్సిందేనని మళ్లీ స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవడంతో దేవాదాయశాఖ చట్టం సెక్షన్ 15, 29 ప్రకారం మూడేళ్ల పాటు మినహాయింపు లభించింది. దీంతో మొన్నటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ, వ్యవహారాలన్నీ కొనసాగాయి. ప్రస్తుతం మినహాయింపు సమయం ముగియడంతో మల్లన్న స్వామి ఆలయాన్ని సోమవారం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు..
మల్లన్న స్వామి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న దేవాదాయశాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జాతర ద్వారా రూ.18,13,095 సమకూరింది. 66 గ్రాముల మిశ్రమ బంగారం, 7.170 కిలోల మిశ్రమ వెండి వచ్చింది. గ్రాములు వచ్చింది.

దేవాదాయశాఖలోకి మల్లన్న ఆలయం