
మీ సేవ.. మరింత చేరువ
కరీంనగర్ అర్బన్: కాగిత రహిత పాలనగా సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలకు వేదికవుతోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందిస్తుండగా రెండు నెలల క్రితం తొమ్మిది రకాల సేవలను పొందుపర్చారు. తాజాగా మరో రెండు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పురపాలిక, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల పేరు మార్పిడి, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్, మార్కెట్ విలువ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్–1(బి) సర్టిఫైడ్ కాపీలు పొందొచ్చు. అప్లికేషన్ కాగితాలతో కార్యాలయాలకు వెళ్లకుండా మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు వివరించారు.
● వివాహ ధ్రువపత్రం పొందడం తేలిక
వివాహమైన నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి. సదరు ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుండేవారు. బ్రోకర్లు వేలకు వేలు దండుకుని ఇబ్బందులకు గురిచేస్తుండగా పలువురు అన్ని పత్రాలకు తామే బాధ్యులమంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రయాస లేకుండా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దళారులకు అస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.
● కావాల్సినవి ఏంటంటే..
వధూవరులిద్దరి ఆధార్ కార్డులు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు పత్రాలు. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో. రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు. ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు.
● మార్కెట్ విలువ పత్రాలు పొందొచ్చు
గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మ్యానువల్‌గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు.
● త్వరలో ఇసుక బుకింగ్ కూడా..
ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు ‘మీ సేవ’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ–సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది.
కొత్తగా మరో రెండు సేవలు