
‘ఎల్లంపల్లి’పైనే ఆశలు
● వరదనీటిని ఒడిసి పట్టుకుంటేనే ప్రయోజనం
● రెండేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతలు
రామగుండం: దశాబ్దకాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు క్రమంగా పెరుగుతున్న నీటి వినియోగం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అనతికాలంలోనే నీటి నిల్వలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరే క్రమంలోనే ఎల్లంపల్లికి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గతేడాది అధికారులు ప్రత్యేక చొరవతో వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ముందస్తు ప్రణాళికతో అన్ని అవసరాలను ఎల్లంపల్లితోనే పూర్తి చేసుకోవడం గమనార్హం.
ప్రాజెక్టు వివరాలు..
ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 148.00 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు. నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల మేరకు 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఇదే రోజు గతేడాది కేవలం 4.80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో నింపుకునే రిజర్వాయర్లు
● లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ను ఏటా ఎల్లంపల్లి జలాలతో నింపుకోవడం జరుగుతోంది.
● రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.5 టీఎంసీలు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 9.68 లక్షల ఎకరాలు, సరస్వతీ కెనాల్ 34వేల ఎకరాలు, లక్ష్మి కెనాల్ నుంచి 21వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. వీటితో పాటు ఇతరత్రా తాగునీటి అవసరాలను తీర్చుతుంది.
● మిడ్‌మానేర్ రిజర్వాయర్‌కు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉంది.
● కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు 15 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది.
● కొమురవెల్లి మల్లన్నసాగర్ 50 టీఎంసీల వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది.

‘ఎల్లంపల్లి’పైనే ఆశలు