
సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం ‘మథనం’
జగిత్యాల: సమాజంలోని సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం మథనం పుస్తకమని సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల అన్నారు. జగిత్యాలకు చెందిన కళాకారుడు ఎములవాడ మహిపాల్ రచించిన మథనం కవితాసంపుటిని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతమైన సాహిత్య పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాకారులు విజయ్, క్రాంతి పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు
జగిత్యాలక్రైం: తనను కానిస్టేబుల్ బండపల్లి ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకుని మోసం చేయడంతోపాటు మరో యువతితో ఇటీవల కనిపించకుండా పోయాడంటూ సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన కస్తూరి భావన జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. భావన జగిత్యాలలో హాస్టల్‌లో ఉన్న సమయంలో ఒకసారి డయల్ 100కు కాల్ చేసింది. ఆ సమయంలో పరిచయమైన కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బండపల్లి ప్రసాద్ అనే కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు తనతో కాపురం చేసి.. కొన్నాళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కనిపించకుండాపోయాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
గోదావరి తీర గ్రామాలు అప్రమత్తం
ధర్మపురి/సారంగాపూర్: ధర్మపురి, బీర్‌పూర్ మండలాల్లోని గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి తహసీల్దార్ సుమన్, బీర్‌పూర్ ఎస్సై ఎస్.రాజు ఆయా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీర్‌పూర్‌లోని చిన్నకొల్వాయి, రేకులపల్లి, కమ్మునూర్ గ్రామాల్లో పర్యటించిన ఎస్సై.. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోందని, ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులు తారని, ప్రజలు గోదావరిలోకి పశువులు, గొర్రెలను మేపేందుకు వెళ్లవద్దని సూచించారు.
పంటల సాగుపై అవగాహన
జగిత్యాలఅగ్రికల్చర్: రావెఫ్ విద్యార్థులు పంటల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ వర్సిటీ మాజీ ఈఆర్‌సీ సభ్యుడు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ అగ్రికల్చర్ విద్యార్థులు కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌కు చేరుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలతోపాటు సాగు పద్ధతులు తెలుసుకున్నారు. కొండాపూర్ మైసమ్మ చెరువుకు కాలువల ద్వారా నీటి సరఫరాపై వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు వెల్ముల రాంరెడ్డి వివరించారు. మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, విద్యార్థినులు శృతి, ప్రణీత, శ్రావణి, దీప్తి, హరిణి పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం
మెట్‌పల్లి: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వెళ్తూ.. మెట్‌పల్లి బస్‌స్టేషన్‌లో ఆగింది. ప్రయాణీకులతో జగిత్యాల వైపు బయలుదేరిన బస్సు.. ఔట్ గేట్ నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లగానే ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయి ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని బస్‌స్టేషన్‌కు తరలించి నిర్మల్ డిపోకు సమాచారమందించారు. అక్కడి అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో బస్సును పంపించారు.

సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం ‘మథనం’

సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం ‘మథనం’