
‘ఓటుకు నోటు’ ముద్దాయిని సీఎం చేశారు..
మల్లాపూర్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ముద్దాయిని కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసిందని, దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో 18 నెలలుగా రేవంత్ రెడ్డి రాష్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంపై అవగాహన లేక కేసీఆర్, కేటీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిసారీ సవాల్ చేస్తూ.. పారిపోతున్నారని విమర్శించారు. ఆయన సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చకు రమ్మంటే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తోకముడిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలపై పథకాల మత్తుమందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని, పాలన చేతకాక నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసిందని తెలిపారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే ఈ–ఫార్ములా, ట్యాపింగ్ కేసులు, కమిషన్ల పేరిట విచారణలతో ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని తెలిపారు. విద్యార్థులకు భరోసా కల్పించడంలో విఫలం కావడంతో పాటు బాధితులను పరామర్శించి ఆదుకునేవారే కరువయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హోంమంత్రిగా ఉన్నందునే పోలీసులు ఆక్రమ కేసులతో వేధిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ పోరాటాలతోనే వీటిని ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అంగీకారం లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి భూక్య జాన్సన్‌నాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో రాష్ట్రం ఆధోగతి పాలు
పథకాల మత్తు మందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టింది
ప్రజల తరఫున బీఆర్‌ఎస్ నిలదీస్తున్నందునే అక్రమ కేసులు, విచారణలు
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్