
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం
● బాలుడి అద్భుత ప్రదర్శన
● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్‌లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్‌షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్‌శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్‌లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు.