
ధన్యజీవులు
కోల్‌సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు.
వేలల్లో అవయవ దానాలు
సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం.
అవయవదాతలకు గౌరవం దక్కాలి
మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు.
ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్‌దే కావడం విశేషం.