
యూరియా అతి వినియోగంపై ఆందోళన
జగిత్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిగ్గా లేక.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. హరితవిప్లవం రావడంతో అధిక దిగుబడినిచ్చే కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దిగుబడులు పెరిగాయి. అదే సమయంలో అధిక దిగుబడి ఇచ్చేందుకు రైతులు రసాయన ఎరువులు వేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు దొరికే యూరియాను రైతులు అధికంగా వాడుతున్నట్లు వ్యవసాయశాఖ నివేదికల్లో తేలింది. యూరియా మోతాదును మించి పంటలకు వాడుతున్నారని స్వయంగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ.నడ్డా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక్క వానాకాలం సీజన్‌లో సాగుచేసిన పంటలకే 13,843 టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు జిల్లాలో మార్చి వరకు 7607 టన్నుల యూరియా ఉండగా.. ఏప్రిల్‌లో 4248 టన్నులు, మేలో 1257 టన్నులు, జూన్‌లో 470 టన్నులు, జూలైలో 261 టన్నులు రావాల్సి ఉండగా.. రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై కేంద్రం కోత విధిస్తోంది. దీంతో జిల్లాకు అంతంతమాత్రంగానే యూరియా వచ్చింది. ఇక రానున్న రోజుల్లో దొరుకుతుందో..? లేదో..? అని రైతులు అవసరం లేకున్నా నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ మొక్కకై నా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరం. నత్రజని యూరియా రూపంలో లభిస్తుంది. భాస్వరం సింగిల్ సూపర్ పాస్పేట్, డైఅమ్మోనియం పాస్పేట్ (డీఏపీ)ను రైతులు వినియోగిస్తారు. దాదాపు 85 శాతం డీఏపీని కెనాడ, రష్యా, అమెరికాతో పాటు జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ముడి పొటాష్‌ను సైతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
అవసరాన్ని మించి వినియోగం
శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పంటలకు సాధారణంగా 4ః2ః1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందించాల్సి ఉంటుంది. కానీ.. రైతులు ప్రస్తుతం 7.2ః2.9ః1 నిష్పత్తిలో వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రసాయన ఎరువులు అధికంగా వాడే పంజాబ్‌లో 18.6ః 5.4ః1 నిష్పత్తితో మరింత ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే పంజాబ్‌లో పర్యావరణంతోపాటు ఆహార పదార్థాలు కూడా కాలుష్యంతో నిండిపోయి క్యాన్సర్ రోగులు పెరిగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. యూరియా వినియోగం పెరగడం.. పోషకాల సమతుల్యత లోపించడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, పంటల సాంద్రత పెరగడం, పంటల సరళిలో మార్పులు రావడం, పంట పొలాల్లో కార్బన్ లోపించడం వంటి కారణాలతోనే భూముల్లో జింక్ లోపం ఏర్పడుతోంది.
వేపపిండితో మేలు..
యూరియా వాడినప్పుడు విధిగా వేప పిండిని 5ః1 నిష్పత్తిలో అంటే 5 కిలోల యూరియాలో కిలో వేపపిండిని కలిపి వాడితే భూమికి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటలకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది. యూరియా నీటిలో కొన్నాళ్లపాటు నిలువ ఉండి.. మొక్కలకు అవసరమైన సమయంలో అందిస్తుంది. పచ్చిరొట్ట అయిన జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పంటలను వేసిన భూమిలోనే రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. వేసవి పంటల అనంతరం పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మంద ద్వారా పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆయా పంటల్లో రసాయన ఎరువులను భూసార పరీక్షలకు అనుగుణంగా వాడాలి. నేల, వాతావరణ పరిస్థితులను బట్టి రసాయన ఎరువులను పొదుపుగా వాడటం మంచిది.
మోతాదులో వాడాలని కేంద్ర ప్రభుత్వ సూచన
సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన
యూరియా కొరత లేకుండా చూడాలి
జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి. యూరియా అధికంగా వాడుతున్నారనే సాకుతో యూరియా కోటాను తగ్గించడం చేయవద్దు. పంటల దశలను బట్టి యూరియా సరఫరా చేయాలి.
– బందెల మల్లయ్య,
రైతు సంఘం నాయకుడు, చల్‌గల్
యూరియాను నిల్వ చేయొద్దు
జిల్లాలో యూరియా అందుబాటులోనే ఉంది. అవసరం లేకున్నా తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయవద్దు. పంటల పెరుగుదలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తాం. యూరియాతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాలి.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి

యూరియా అతి వినియోగంపై ఆందోళన

యూరియా అతి వినియోగంపై ఆందోళన