
రేషన్.. పరేషాన్
● మూడునెలల బియ్యం ఒకేసారి ● లబ్ధిదారులకు తప్పని తిప్పలు ● రేషన్ షాపుల వద్ద బారులు ● ఈనెల 30 వరకే గడువు ● 89 శాతం పంపిణీ పూర్తి
రేషన్‌కార్డులు: 3,18,731బియ్యం కోటా(3నెలలకు): 17,500 టన్నులు రేషన్ తీసుకున్నది: 2,84,237 మంది పూర్తయింది: 89 శాతం పూర్తి చేయాల్సింది: 11 శాతం
జగిత్యాల: రేషన్ లబ్ధిదారులకు మూడునెలల బియ్యాన్ని ఒకేనెలలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల నుంచి సరఫరా చేస్తున్నారు. ఈనెల 30లోపు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 89 శాతం మంది లబ్ధిదారులు మూడునెలలకు సంబంధించిన సరుకులు పొందారు. మిగతా లబ్ధిదారులు కొన్ని దుకాణాల్లో స్టాక్ నిల్వ లేకపోవడం, స్టాక్ రాలేదని మూసివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని రేషన్‌షాపుల్లో పంపిణీలో జాప్యంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. మొదట బియ్యం పంపిణీ చేసిన సమయంలో ఒక్కో లబ్ధిదారులు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడం, సర్వర్లు మొరాయించడంతో అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడటంతోపాటు, షాపుల ముందు చెప్పులు, సంచులు, రేషన్‌కార్డులు లైన్‌లో పెట్టుకున్నారు. మొదటి 10 రోజులపాటు నానా ఇక్కట్లకు గురయ్యారు. అయినప్పటికీ 89శాతం పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 11 శాతం మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
చివరి దశకు పంపిణీ
రేషన్ షాపుల్లో బుధవారం వరకు 89 శాతం లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 3,18,731 రేషన్‌కార్డులు ఉండగా 2,84,237 మందికి బియ్యం అందించారు. కొన్నిచోట్ల స్టాక్ లేకపోవడంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు వేసే చోట సర్వర్ మొరాయించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. స్టాక్ రాగానే పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం అందజేస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
89 శాతం పంపిణీ పూర్తి
జిల్లాలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఇప్పటివరకు 89 శాతం రేషన్ పంపిణీ పూర్తయింది. కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. స్టాక్ లేని చోట్ల మరోరోజు వెంటనే పంపిస్తున్నాం. ఈనెల 30 వరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– జితేందర్‌రెడ్డి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

రేషన్.. పరేషాన్

రేషన్.. పరేషాన్