
వైద్య కళాశాలలో వసతులు మెరుగుపర్చాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి శివరాంప్రసాద్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాల వసతి గృహంలో ఇబ్బందులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని సూచించారు. కళాశాలలో వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. వసతుల కల్పనపై ఇప్పటికే వైద్య శాఖ మంత్రి దామోదర నర్సింహ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వివరించారు. అనంతరం ఎన్‌ఎంసీ సభ్యులు కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి సమీక్షించారు. వారివెంట ప్రిన్సిపల్ ఖాద్రి ఉన్నారు.
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మించేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కృష్ణహరి, అడువాల లక్ష్మణ్, శంకర్, సుధాకర్, నాగయ్య, మహేందర్ పాల్గొన్నారు.