ఆహ్లాదం ఎండమావే.. | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం ఎండమావే..

May 9 2025 1:32 AM | Updated on May 9 2025 1:34 AM

● పల్లె, బృహత్‌ప్రకృతి వనాలపై నిర్లక్ష్యం ● ప్రకృతి వనాల్లో ఎండిపోతున్న చెట్లు ● అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారిన వైనం ● లక్షల ప్రజాధనం వృథాపై విమర్శలు
మెట్‌పల్లి మండలంలోని మరో గ్రామంలో ప్రకృతి వనానికి మొత్తానికే తాళం వేసి ఉంచుతున్నారు. నిర్వహణలేక ప్రకృతి వనంలోకి వెళ్లేందుకు కొందరు రెండు మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రకృతి వనంలోకి ఎక్కువ మంది వస్తున్నారని, అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఇవేకాదు.. చాలా ప్రాంతాల్లో ప్రకృతి వనాల్లోనూ ఇదే పరిస్థితి.

మెట్‌పల్లిరూరల్‌: ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పల్లె, బృహత్‌ ప్రకృతి వనాలు పలు చోట్ల ఎండిపోతున్నాయి. పంచాయతీల నిర్వహణ లోపం, నిర్లక్ష్యం వెరసి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలకు పెద్దగా ఉపయోగపడకపోగా.. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వనాలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయి. వీటిని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయడం కూడా సమస్యగా మారింది. ఇక్కడి మండల స్థాయి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. చెట్లు ఎండిపోకుండా ఉండేలా చూసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి పదేపదే సూచించినప్పటికీ సిబ్బంది పెడచెవిన పెడుతున్నారని తెలిసింది.

కొన్నింటిపై దృష్టి.. మరికొన్నింటిపై నిర్లక్ష్యం

మెట్‌పల్లి మండలంలో 23 పల్లె ప్రకృతి వనాలు, నాలుగు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటిలో నీడచిచ్చే పలు రకాల అటవీ జాతి మొక్కలు, పూల మొక్కలు, మరికొన్ని రకాల మొక్కలు నాటించారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదం పంచుతుండగా.. మిగతా చోట్ల నామమాత్రంగానే ఉండిపోయాయి. పలు గ్రామాల్లోని ప్రకృతి వనాల్లో చెట్లకు నిత్యం నీటిని పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తీసివేయిస్తున్నారు. ఎండిపోయిన చెట్ల స్థానంలో కొత్త వాటిని నాటుతున్నారు. కానీ మరి కొన్ని వాటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఎండిన చెట్లు.. పరికరాలకు తుప్పు

గ్రామాల్లోని కొన్ని ప్రకృతి వనాల్లో వాడిన మొక్కలు, ఎండిన చెట్లే దర్శనమిస్తున్నాయి. గడ్డి పెరిగిపోయింది. నడకదారి ఎండిన ఆకులతో నిండిపోయింది. చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలను ఏర్పాటు చేసినా అవి ఆడుకోవడానికి వీలు లేకుండా తుప్పుపట్టిపోతున్నాయి. వాటి మధ్య పిచ్చిమొక్కలు పెరిగాయి. కూర్చునేందుకు వేసిన బెంచీలు సైతం దుమ్ము,ధూళితో ఉన్నాయి.

అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా..

కొన్ని ప్రాంతాల్లోని వనాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడే మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, ఇతర కార్యకలాపాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గేట్లకు తాళాలు వేయ డం లేదని, వీటివైపు కన్నైత్తెనా చూడడం లేదని అంటున్నారు. లక్షలు వెచ్చించిన వాటిపై ఇంత నిర్లక్ష్యం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ హయాంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి, బృహత్‌వనాల విషయంలో కార్యదర్శులు నిర్లక్ష్యం చూపడంపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన మండలస్థాయి సమీక్ష సమావేశంలో పల్లెప్రకృతి వనాలు అధ్వానంగా మారాయని, వాటిని ఎందుకు పట్టించుకోవడంలేదని కార్యదర్శులను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు నీరు అందించాలని చెట్లు ఎండిపోకుండా చూడాలని సూచించారు. కొద్దిరోజుల తర్వాత గ్రామాల్లో పర్యటిస్తానని ఆ సమయంలో పల్లెప్రకృతి వనాలను పరిశీలిస్తానని హెచ్చరించారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మెట్‌పల్లి మండలంలోని ఓ గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ఇది పూర్తిగా అధ్వానంగా మారింది. గ్రామానికి దూరంగా ఉండడంతో అసాంఘిక కార్యకలపాలకు నెలవుగా మారింది. నిర్వహణ పట్టించుకోకపోగా.. గేటుకు తాళం వేయడంలేదు. గేటు ఎప్పుడూ తెరిచే ఉండడంతో కొందరికీ పలు కార్యకలపాలకు అడ్డాగా మారిందని అక్కడి ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ఎప్పటికప్పుడు నీరు పడుతున్నం

ప్రకృతి వనాల్లో చెట్లు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది నీరు పడుతున్నారు. చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా అక్కడక్కడ చెట్లు ఎండిపోతున్నాయి. పల్లెప్రకృతి వనాల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కార్యదర్శులకు సూచనలు చేశాం.

– మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement