● రియల్ వ్యాపారుల మీమాంస ● మందకొడిగా రిజిస్ట్రేషన్లు
కోరుట్ల: కటాఫ్ తేదీ తర్వాత జరిగే భూ క్రయ విక్రయాలకు ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు కడితేనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న నిబంధన రియల్ వ్యాపారులను డైలమాలో పడేసింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న క్రయవిక్రయాల్లో చాలా మేర భూమిని కొని ..లాభం చూసుకుని అమ్మేసే రకం రిజిస్ట్రేషన్లు అధికం. నిజంగా ఇల్లు కట్టుకునేందుకు భూములు కొనుగోలు చేసేవారు తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు భూమి కొనుగోలు చేసినా ఇల్లు ఎప్పుడు కడతారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగే భూ క్రయవిక్రయాలకు చెందిన ఎల్‌ఆర్‌ఎస్ ఎవరు కట్టాలనే మీమాంస నెలకొంది.
ఎల్‌ఆర్‌ఎస్ ఎవరు కట్టాలి
ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌లో చాలా మంది ప్లాట్లు కొనుగోళ్లు చేసి ధర పెరిగినప్పుడు అమ్ముకునే వారే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తేదీ 26–08–2020 కంటే ముందు లింక్ డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ సమయంలో లేదా ఇల్లు కట్టే సమయంలో ఏదైనా ఓ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ డబ్బు కట్టేలా వెసులుబాటు ఇచ్చా రు. కానీ, కటాఫ్ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఎల్‌ఆర్‌ఎస్ చె ల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో రియల్ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు చేసే వ్యాపారుల నుంచి భూమి కొనుగోలు చేసిన అంశంలో వీళ్లలో ఎవరు ఇల్లు కట్టుకునే వారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము కట్టాలనే అంశం సమస్యగా మారింది.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
జిల్లాలోని జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లి, కోరుట్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీట న్నింటిలో కలిపి రోజూ సుమారు 250– 350 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కాగా, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించాలన్న కొత్త నిబంధన వచ్చిన అనంతరం ఈ పదిహేను రోజుల వ్యవధిలో రోజూ జిల్లావ్యాప్తంగా కేవలం 120–150 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపాల్టీల్లోనే వెబ్‌సైట్ సక్రమంగా పనిచేయ డం, ఇతర ప్రాంతాల్లో వెబ్‌సైట్ సరిగా ఒపెన్ కాకపోవడం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడానికి కొంత కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద కొత్తగా ఎల్‌ఆర్‌ఎస్ డబ్బుల చెల్లింపు నిబంధన రియల్ వ్యాపారంలో క్రయవిక్రయాలపై కొంత ప్రభావం చూపినప్పటికీ ఇల్లు కట్టుకునే, రిజిస్ట్రేషన్ల సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించే వారికి మాత్రం ఈ నెల 31 వరకు నిర్ణయించిన 25 శాతం డిస్కౌంట్ కలిసివస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.