యువతలో బీపీ, షుగర్‌ | - | Sakshi
Sakshi News home page

యువతలో బీపీ, షుగర్‌

Mar 13 2025 12:14 AM | Updated on Mar 13 2025 12:13 AM

● 30ఏళ్లకే చుట్టుముట్టుతున్న వ్యాధులు ● ఎన్సీడీ స్క్రీనింగ్‌తో గుర్తింపు ● మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు ● ఒత్తిడి తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావం

‘జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్‌కు సుమారు 30ఏళ్లు ఉంటాయి. కొద్దిరోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల జిల్లాకేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన ఎన్‌సీడీ సర్వేలో వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు చేశారు. ఇందులో నరేశ్‌కు షుగర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య సిబ్బంది అతడికి మందులు అందించి షుగర్‌ అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు..’ ఇది ఒక్క నరేశ్‌ సమస్య కానేకాదు. వందలాది మంది యువతది ఇదే పరిస్థితి.

గొల్లపల్లి: మారుతున్న జీవనశైలితో అనేక మంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహారపదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందులో భాగంగా యువతకు కూడా బీపీ, షుగర్‌ వస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఇలాంటి వ్యాధులు 30ఏళ్లు దాటకున్నా.. బయటపడటం కలవరపెడుతోంది. వేలాది మంది ఇలా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఎన్‌సీడీ పరీక్షల్లో నిర్ధారణ అవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్‌లో 90,390 మందికి బీపీ, 41,140 మందికి షుగర్‌ ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్‌సీడీ కార్నార్ల్‌, క్లీనిక్‌ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆదేస్థాయిలో చికిత్స కూడా అందుతుంది.

వంశపారపర్యంగానూ..

డయాబెటీస్‌ ఎక్కువగా వంశపార్యపరంగా.. వయసు పెరిగే కొద్ది వస్తుంది. దూమపానం, అల్కాహాల్‌ తీసుకోవడం ద్వారా పాంక్రియాటిక్‌ గ్రంథిలో ఇన్సూలిన్‌ ఉత్పత్తి తగ్గి వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం, టీవీ ఎదుట కూర్చొని చిరుతిళ్లు తినడం, ఎలాంటి వ్యాయామం చేయకపోవడంతో ఊబకాయం పెరిగి అధిక డయాబెటీస్‌కు దారి తీస్తుంది. చిన్న వయస్సులో ఎత్తుకంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్రపట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు.

నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం..

చాలామంది బీపీ, షుగర్‌ బాధితులు వాటి బారినపడిన సంగతిని గుర్తించడం లేదు. నిర్లక్ష్యంతోనే ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో పిల్లలోనూ డయాబెటీస్‌ లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జనులోపంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. పదేళ్లలోపు పిల్లలు కూడా వ్యాధి బారినపడుతున్నారు. త్వరగా అలిసిపోవడం, తిన్న వెంటనే ఆకలి అనిపించడంతో పిల్లలు చదువు, ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.

పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ..

గత ఐదేళ్లలో బీపీ, షుగర్‌ బారిన పడిన వారిలో 40శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తంపోటు బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఒక్క జగిత్యాల పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 9,334 మంది బీపీ, 4,297 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది.

నియంత్రణే మార్గం..

రక్తపోటు, మధుమేహం నియంత్రణ తప్ప నివారణకు అవకాశం లేదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీస్‌ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యేవారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం..తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడుతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.

జీవనశైలి మారాలి

ప్రస్తుతం 30ఏళ్లకే బీపీ, షుగర్‌ వస్తోంది. జీవనశైలిలో మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటుపడటం.. వాకింగ్‌ చేయకపోవడంతో వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసకోవడం ద్వారా నియంత్రించవచ్చు.

– శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో

వ్యాయామం తప్పనిసరి

ఒత్తిడి కారణంగా ఈ జబ్బులు వస్తున్నాయి. వ్యాయాంమం చేయకపోవడం... సరైన ఆహారం తీసుకోకపోవడంతో చుట్టుముట్టుతున్నాయి. పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. పెద్దలు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుంది.

– అర్చన, ఎన్‌సీడీ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌

యువతలో బీపీ, షుగర్‌1
1/2

యువతలో బీపీ, షుగర్‌

యువతలో బీపీ, షుగర్‌2
2/2

యువతలో బీపీ, షుగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement