సమయం లేదు మిత్రమా..! | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా..!

Mar 9 2025 1:47 AM | Updated on Mar 9 2025 1:42 AM

జగిత్యాల: బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం సమీపిస్తున్నా.. ఇంకా కొన్ని బల్దియాల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్‌ గ్రాంట్స్‌ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. గతేడాది కోరుట్ల మున్సిపాలిటీ 100 శాతం సాధించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అవార్డు కూడా అందుకుంది. ఎప్పటిలాగే ఇప్పడు కూడా కోరుట్ల బల్దియా 76.45 శాతంతో ముందంజలో ఉంది. అలాగే మెట్‌పల్లి 73.25శాతం, రాయికల్‌ 69.73, ధర్మపురి 53.49శాతం వసూలు చేసింది. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో మాత్రం కేవలం 52 శాతం వసూలుతో చాలా వెనుకబడిపోయింది. దీంతో స్పెషల్‌ గ్రాంట్‌ నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతోంది.

బకాయిదారులకు రెడ్‌ నోటీసులు

జిల్లాలో చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు. మూడుసార్లు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆస్తిపన్ను చెల్లించనివారి ఆస్తి జప్తు చేసుకుంటారు. జగిత్యాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు 100 మందికి రెడ్‌ నోటీసులు జారీ చేశారు. గతంలో బకాయి పడిన వారి ఇంటి ముందు డప్పు చాటింపు చేసి వినూత్న రీతిలో సైతం వసూలు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 32 బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నా ఆస్తిపన్ను వసూళ్లలో మాత్రం జగిత్యాల వెనుకబడే ఉంది.

అభివృద్ధికి ఆటంకం

వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. ఆ నిధుల ద్వారా అభివృద్ధి చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. కానీ ప్రజలు ఆస్తిపన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో పట్టణ ప్రగతి నిధులు రాగా సుందరీకరణ పనులు, రోడ్లు, ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు. అధికారులు స్పందించి పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రజలు సహకరించాలి

జిల్లాకేంద్రంలో ఆస్తిపన్ను చెల్లించని 100 మందికి ఇప్పటికే రెడ్‌నోటీసులు జారీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలి. ఆస్తిపన్ను కట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది.

– చిరంజీవి, మున్సిపల్‌ కమిషనర్‌

జిల్లాలోని బల్దియాల్లో పన్నుల డిమాండ్‌, బకాయిలు, వసూళ్లు (రూ.లక్షల్లో)

మున్సిపాలిటీ డిమాండ్‌ ఏరియర్స్‌ మొత్తం వసూలు బ్యాలెన్స్‌ శాతం

జగిత్యాల 737.79 563.82 1301.61 624.66 624.66 52.01

కోరుట్ల 446.36 38.68 505.04 388.02 119.55 76.45

మెట్‌పల్లి 359.88 35.79 395.67 288.54 105.37 73.25

రాయికల్‌ 109.35 21.58 130.93 92.19 40.02 69.73

ధర్మపురి 96.28 49.98 146.25 72.13 62.72 53.49

మొత్తం 1769.66 709.84 2479.50 1517.83 952.32 61.45

సకాలంలో పన్నులు చెల్లించాలి

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు సీజ్‌ చేస్తామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు భవన సముదాయాలను సందర్శించి యజమానులకు నోటీసులు జారీ చేయించారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం ఆస్తిపన్ను 1355.07 లక్షలు ఉండగా.. ఇప్పటివరకు రూ.699.80 లక్షలు మాత్రమే వసూలు అయిందన్నారు. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి పురపాలక సంఘం చట్టం 2019 ప్రకారం సీజ్‌ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్‌ కనకయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ ఉన్నారు.

త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

బల్దియాల్లో ముందుకు కదలని పన్ను వసూళ్లు

ఇప్పటివరకు 61.45 శాతమే పూర్తి

76.45శాతంతో ముందంజలో కోరుట్ల

52.01 శాతంతో వెనుకబడిన జగిత్యాల

సమయం లేదు మిత్రమా..!1
1/2

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!2
2/2

సమయం లేదు మిత్రమా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement