Cannes Film Festival 2023: కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఊహించని ఘటన.. మహిళ ఒంటిపై ‘రక్తం’ పోసుకుని

Woman Pours Fake Blood On Self At Cannes Red Carpet Video Goes Viral - Sakshi

అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక మహిళ తెలిపిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫెస్టివల్‌లో ఆదివారం సాయంత్రం ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకుడు జస్ట్ ఫిలిప్పోట్ చిత్రం యాసిడ్ ప్రీమియర్‌కు ముందు ఓ మహిళ ఉక్రెయిన్‌ జెండా రంగులున్న దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పైకి నడుచుకుంటూ వెళ్లి, ఓ చోట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది.

అనంతరం తన వెంట తెచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని నిరసన తెలపడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులు కారణంగా అక్కడ నెత్తుటి దారులు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే.

దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.  ఆమె ఉక్రెయిన్‌ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ ఈ ఏడాది కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్‌ కంపెనీలపై కేన్స్‌ నిషేధం విధించారు.  గతేడాది కూడా ఓ మహిళ ఇలాగే అనూహ్యంగా నిరసనకు దిగి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.

 

చదవండి: సూడాన్‌: అమెరికా, సౌదీ దౌత్యం.. సంబురపడేలోపే కథ మళ్లీ మొదటికి! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top