చంపే లిస్ట్‌లోనుంచి వారిని తీసేసిన అమెరికా -ఇజ్రాయెల్‌! | US Temporarily Pauses Strikes On Iran, Key Iranian Leaders Removed From US Israel Hit List Amid Talks, More Details Inside | Sakshi
Sakshi News home page

చంపే లిస్ట్‌లోనుంచి వారిని తీసేసిన అమెరికా -ఇజ్రాయెల్‌!

Mar 27 2026 7:08 PM | Updated on Mar 28 2026 1:25 PM

Why Irans Foreign Minister Speaker Have Been Hide Out From Israels List

వాషింగ్టన్‌: అమెరికా-ఇజ్రాయెల్‌లు  సంయుక్తంగా ఇరాన్‌పై కాలుదువ్విన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల యుద్ధం తర్వాత ఈ యుద్దం నుంచి అమెరికా కాస్త విరామం తీసుకుంది. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, అందుకే యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్‌ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ‍ట్రంప్‌ మూడు రోజుల క్రితం ప్రకటించారు .అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతి స్థాపన లక్ష్యం అంటూ యూటర్న్‌ తీసుకున్నారు ట్రంప్‌. 

అయితే ఇక్కడ ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల యుద్ధమైతే ఆగలేదు. ట్రంప్‌ ప్రకటనతో అమెరికా వెనక్కి తగ్గినా, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంది. అయితే ట్రంప్‌ను నమ్మడానికి వీలు లేదనే ఇరాన్‌ ప్రకటనను కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే అమెరికా దాడులు చేయకుండా ఆగిపోయి, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేయిస్తుందనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. 

ఇదిలా ఉంచితే, అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధరీతిలో భాగంగా వారి హిట్‌ లిస్ట్‌లో నుంచి ఇద్దరు ఇరాన్‌ కీలక నేతల పేర్లను తొలగించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ ఆయుతుల్లా ఖమేనీతో పాటు పలువురు కీలన నేతలను, అధికారులను చంపేసిన ఆ ఇరు దేశాలు.. ఇప్పుడు తాజాగా  ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్సాస్‌ అరగ్చీ, పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ ఘలిబాఫ్‌ పేర్లను హిట్‌ లిస్ట్‌ నుంచి తొలగించింది. 

ఇవే కారణాలు..
వారిని అమెరికా-ఇజ్రాయెల్‌  హిట్‌ లిస్టులో నుంచి తొలగించడానికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు ఇరాన్‌తో చర్చలు అంటున్న అమెరికా..   ఇంకా మిగిలి ఉన్న ఇరాన్‌ నేతలను కూడా చంపేస్తే ఎవరితో చర్చలు జరుపుతారు అనే చర్చ వచ్చింది. ఇరాన్‌లోఅబ్బాస్‌ అరగ్చీతో పాటు స్పీకర్‌ ఘలిబాఫ్‌లు  ప్రస్తుతం కీలక నేతలు.  ఒకవైపు చర్చలు అంటూ వారి పేర్లను ఇంకా హిట్‌ లిస్ట్‌లోనే ఉంచితే తప్పుడు సంకేతం అవుతుందని వారి పేర్లను ఇజ్రాయెల్‌ తొలగించింది. అమెరికా ఆదేశాలతో వారి పేర్లను హిట్‌ లిస్ట్‌ జాబితా నుంచి తీసేసింది. 

పాక్‌ రాయబారం..!
ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక..  పాకిస్తాన్‌  ఆయా దేశాల మధ్య రాయబారం నడుపుతుంది. ఇరాన్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్‌.. అందుకు పాక్‌ను ఎన్నుకున్నారు. ఇరాన్‌ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్‌.. ఇక పాక్‌ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్‌లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్‌ ఇచ్చారు. 

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్‌లో ట్రంప్‌ పడ్డారని, అందుకే ఇరాన్‌పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్‌పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్‌ వెనుకడుగు వేశారు. 

ఆ క్రమంలోనే ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పేశారు. కానీ  ఈ ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, తమతో  ఎవరూ చర్చలకు రాలేదని ఇరాన్‌  స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్‌ను తెరపైకి తీసుకొచ్చింది అమెరికా.  పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం వహించే క్రమంలో ఇజ్రాయెల్‌ హిట్‌ లిస్టులో ఉన్న  అరగ్చీ, ఘలిబాఫ్‌ల పేర్లను తీసేయమని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

ఇరాన్‌.. పాక్‌ మాట వింటుందా..?
ప్రస్తుతం ఇరాన్‌ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్‌ మాట.. ఇరాన్‌ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్‌  అనే చర్చ మొదలైంది.    ఒకవేళ ఇరాన్‌ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్‌కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. మరి  ఆ విషయంలో అమెరికాను పాక్‌ ఎలా ఒప్పిస్తుందనేది మరొక ప్రశ్న. 

ప్రస్తుతానికి హిట్‌ లిస్టులో నుంచి వారి పేర్లను తొలగించారు కానీ చర్చలు సఫలం కాకపోతే మాత్రం మరొకసారి తీవ్రస్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటున్న సమయంలో మరి పరిస్థితి ఎటుపోతుందో అనే భయం కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement