మీనా హారిస్‌కు వైట్‌హౌజ్‌ హెచ్చరికలు!

White House To Meena Harris On Kamala Harris Name For Personal Brand - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సోదరి కుమార్తె మీనా హారిస్‌కు శ్వేతసౌధం హెచ్చరికలు జారీచేసింది. ఇకపై వైస్‌ ప్రెసిడెంట్‌ పేరును ప్రచారం కోసం వాడుకోవడం మానేయాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఆమె పేరిట బ్రాండ్‌ ప్రమోషన్‌ సరికాదు. కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అదే మేం చెప్పాం. ఇలాంటి ప్రవర్తన మార్చుకోవాలి’’ అని మీనా హారిస్‌కు వైట్‌హౌజ్‌ లీగల్‌ టీం​ స్పష్టం చేసినట్లు లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ ఓ కథనం వెలువరించింది. వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంటీ పేరిట స్వెట్‌షర్ట్స్‌, స్విమ్‌సూట్స్‌, ఇతర ఉత్పత్తులు తయారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

కాగా అగ్రరాజ్య తొలి ఉపాధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన కమలా హారిస్‌ భారత- జమైకా సంతతికి చెందిన వారన్న విషయం తెలిసిందే. ఆమెకు ఏకైక సోదరి మాయా హారిస్‌ ఉన్నారు. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కమల రాజకీయాల్లో రాణిస్తుండగా.. మాయా, హిల్లరీ క్లింటన్‌ న్యాయవాదిగా, సలహాదారుగా పనిచేశారు. ఇక మాయాకు కుమార్తె మీనాక్షి ఆష్లే హారిస్‌ ఉన్నారు. ఆమె కూడా న్యాయవాదే. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. వృత్తితో పాటు ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చే ఆమె, చిన్నారుల కోసం పుస్తకాలు కూడా రాశారు. అంతేగాక సామాజిక కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రచారోద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు.

ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఓ కంపెనీ స్థాపించిన మీనా.. టీ షర్టులు, స్వెట్‌షర్ట్స్‌ అమ్మకాలు చేపట్టారు. ఇందుకై కమలా హారిస్‌ పేరును ఆమె వాడుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె దేశ రెండో అత్యున్నత హోదాలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి పబ్లిసిటీ వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని, కమల సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. చట్టపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌజ్‌ ఈ మేరకు మీనా హారిస్‌కు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

చదవండి1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ
చదవండి:ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top