చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? | what Trump says in Axios what will happen | Sakshi
Sakshi News home page

చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా?

Apr 30 2026 2:12 AM | Updated on Apr 30 2026 2:20 AM

what Trump says in Axios what will happen

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రతిపాదనకు నో చెప్పేశారు. బాంబుదాడుల కంటే నిర్బంధమే ప్రభావవంతమని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా హార్మూజ్‌ నిర్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? ఏయే పరిణామాలు సంభవిస్తాయి? ట్రంప్‌ మళ్లీ ఏం చెప్పారు.  

ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ‘యాక్సియోస్‌’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. తదుపరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, తమ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.

ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరిస్తూ.. ఆ దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలకు పరిష‍్కారం వచ్చే వరకు హార్మూజ్‌ నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీన్నే ట్రంప్ తిరస్కరించారు.

ట్రంప్ యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్బంధం బాంబుదాడుల కంటే కొంత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు. ఇరాన్‌ బాగా ఇబ్బందులు పడుతోందని, పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుందని చెప్పారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, నిర్బంధం కొనసాగాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. కానీ తాను నిర్బంధాన్ని ఎత్తివేయాలనుకోవడం లేదని అన్నారు. ఇరాన్‌ వద్ద అణ‍్వాయుధం ఉండకూడదని తెలిపారు.

చమురు నిల్వలు, పైపులైన్లు పేలతాయా?
నిర్బంధం వల్ల ఇరాన్ చమురు ఎగుమతి చేయలేకపోతోందని, నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితికి సమీపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఇప్పట్లో ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ నిర్బంధాన్ని ప్రధాన ఒత్తిడి సాధనంగా చూస్తున్నారని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఇరాన్ ఒప్పుకోకపోతే సైనిక చర్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక దాడికీ అమెరికా ఆదేశాలు ఇవ్వలేదని యాక్సియోస్‌ చెప్పింది.

యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడుల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్‌లోని మౌలిక వసతులను లక్ష్యాలుగా చేసుకునే అవకాశం ఉంది.

ఇరాన్‌ సైతం రెడీ 
ఇదిలా ఉండగా, ఇరాన్ భద్రతా వర్గాల ఉన్నత అధికారి మాట్లాడుతూ.. అమెరికా హార్మూజ్‌ నిర్బంధానికి ప్రతిగా ఇంతవరకు చూడని విధమైన చర్యను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యం ఇప్పటివరకు సహనం వహించిందని, సహనానికి పరిమితి ఉంటుందని చెప్పారు.

ఇలాగైతే ఏయే పరిణామాలు సంభవిస్తాయి?
ఇరాన్‌-అమెరికా తీరు వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణకు దారితీయవచ్చు. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి చమురు సరఫరా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దౌత్య చర్చలు కఠినమై పరిష్కారం ఆలస్యం కావచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement